100 మంది రైతుల ఆచూకీకి సమితి

100 మంది రైతుల ఆచూకీకి సమితి

న్యూ ఢిల్లీ : గణతంత్ర దినోత్సవం నాడు ఇక్కడ నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ అనంతరం కనిపించకుండాపోయిన దాదాపు 100 మంది రైతుల ఆచూకీ కోసం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆరుగురితో ఒక సమితి ఏర్పాటయింది.ఇది గల్లంతయిన వారి గురించి సమాచారాన్ని సేకరించి తగిన చర్య కోసం అధికార వర్గాలకు అందజేస్తుంది. గల్లంతైనవారి గురించి 81980 22033 నంబరు ద్వారా ఎవరైనా సమాచారాన్ని తెలియ పరచవచ్చని కిసాన్ మోర్చా తెలిపింది. ఆచూకీ తెలుసుకోవడంలో చట్టపరంగా సాయం చేయడానికి అన్ని చర్యలూ తీసుకుంటామని శిరోమణి అకాలీదళ్ అధినేత బాదల్ చెప్పారు. కేసుల్ని ఉచితంగా వాదించేందుకు అన్ని జిల్లాల్లో న్యాయవాదులను సిద్ధం చేసినట్లు తెలిపారు.అన్నదాతల ఉద్యమం మరింత ఉధృత రూపం దాల్చుతోంది. సింఘు కు రైతుల తాకిడి ఎక్కువయింది. వేలాదిగా రైతన్నలు ఆందోళనలో చేరుతోన్న క్రమంలో.. ఢిల్లీ సరిహద్దుల్లో వివిధ చోట్ల అంతర్జాల సేవలను నిలిపినందుకు రైతులు నిరసించారు. అన్యాయం, అప్రజాస్వామికమని ఖండించారు. మరిన్ని వేల మంది అక్కడకు రాబోతున్నారని సత్నామ్సింగ్ సాహ్ని అనే రైతు నేత తెలిపారు. వేలాదిగా ఉన్న తమకు తాగునీరు, ఆహారం, ఇంటర్నెట్ వంటివి అందకుండా చేస్తున్నారని విమర్శించారు. అయినా వెనక్కి తగ్గేది లేదన్నారు.కొత్త సాగు చట్టాలనేవి అనేక నష్టాలను రాజేసే అగ్గిలాంటివి అని భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు రాకేశ్ టికాయిత్ పేర్కొన్నారు. ‘ కొత్త సాగు చట్టాలు అనేక నష్టాలను రాజేసే అగ్గి లాంటివి. వీటిని రద్దు చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి నష్టమేమీ ఉండదు. మీ పొరపాటును అంగీకరించి చర్చలు జరపండి. మేం పెద్దగా చదువుకోలేకపోవచ్చు.. కానీ సమాజం ఏ దిశగా వెళుతుందో మాకు తెలుసు. బిజెపి రాజకీయాలు చేయడం లేదా ? రైతులు మౌనంగా ఉండాలా ? అది జరగదు. రైతులు బలహీనపడినట్లు భావించొద్దు. ఇక ఏటా ఒకటి రెండు రాష్ట్రాల్లో ఎన్నికలుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకోండి. ” అని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos