ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని ప్రజలు ఛీకొడుతున్నారు

ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని ప్రజలు ఛీకొడుతున్నారు

న్యూ ఢిల్లీ : మతోన్మాద ఆర్ఎస్ఎస్ను, దాని రాజకీయ వేదిక అయిన బీజేపీని ప్రజలే ఛీకొడుతున్నారని, వాటికి వ్యతిరేకంగా ధీరోదాత్తంగా పోరాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు. వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ మేరకు విమర్శించారు. ప్రజాస్వామ్యం,రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రజలు పోరాడుతున్నారని, అందుకే వారు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారన్నారు. రామాలయం, హిందూ-ముస్లిం విభజన, భారత్-పాకిస్థాన్ మధ్య ఘర్షణల పేరుతో బీజేపీ పదేపదే ప్రజలను భావోద్వేగ ప్రచారాలతో మోసం చేస్తోందని గుర్తు చేశారు. అయితే ఈ దఫా ఎన్నికల్లో ప్రజలు బీజేపీ అసలు రంగును అర్థం చేసుకున్నారని తెలిపారు. ఇండియా ఫోరానికి సానుకూల ఫలితాలు రాబోతున్నాయని చెప్పారు. ఇండియా ఫోరానికి ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు వస్తాయన్నారు. బీజేపీ ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని, ప్రతిపక్షాల ఐక్య వేదికగా తమ ఫోరానికి మద్దతుగా ప్రజలు పోరాడుతున్నారని తెలిపారు. ఈ దఫా సార్వత్రిక ఎన్నికల్లో ధరల పెరుగుదల, నిరుద్యోగం ప్రధాన అంశాలుగా మారాయని ఖర్గే ఆరోపించారు. రెండు కోట్ల ఉద్యోగాలు, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి రప్పించడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం వంటి హామీలను బీజేపీ నెరవేర్చలేకపోయిందని ఆయన విమర్శించారు.
‘రాజ్యాంగాన్ని మార్చాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి. 400 సీట్లు గెలిపించాలని బీజేపీ పదేపదే చెబుతోంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా రిజర్వేషన్ గురించి మాట్లాడారు. రాజ్యాంగంలో ఉన్న వాటిని వారు తీసేయలేరు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుంది. పలు పదవుల్లో ఆర్ఎస్ఎస్ వ్యక్తులను నియమించాలనుకుంటుంది. మధ్యప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, మణిపుర్, ఉత్తరాఖండ్, గోవాలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ ఇబ్బందుల పాల్జేసింది. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూడా అంగీకరించదు. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తోంది. అందుకే ఈ ఎన్నికలు ప్రజలకు చాలా ముఖ్యమైనవి’ అని ఖర్గే తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos