రాహుల్ గాంధీకి కాంగ్రెస్ అధ్యక్ష పదవి

రాహుల్ గాంధీకి కాంగ్రెస్ అధ్యక్ష పదవి

బెంగళూరు : ‘కాంగ్రెస్ పార్టీ నేతల్లో దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకోగలిగే నేత రాహుల్ గాంధీ మాత్రమే. పార్టీ అధ్యక్ష పదవిని మళ్లీ స్వీకరించాలని మేము ఆయనను ఒప్పిస్తామ’ని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే చెప్పారు. శనివారం ఇక్కడ ఒక వార్తా సంస్థతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఎవరు చేపట్టినా, వారికి దేశవ్యాప్తంగా మద్దతు లభించాలి. కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు అందరూ మద్దతివ్వాలి. యావత్తు కాంగ్రెస్ పార్టీకి ఆ నేత ఆమోదయోగ్యుడై ఉండాలి. అదే విధంగా అందరి గుర్తింపు పొంది ఉండాలి. మా పార్టీలో అటువంటి నేత రాహుల్ గాంధీ మినహా మరొకరు లేరు. కాంగ్రెస్లో చేరి, పార్టీ కోసం పని చేయాలని సోనియా గాంధీ పై సీనియర్ నేతలంతా గతంలో ఒత్తిడి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అదే విధంగా రాహుల్ కూడా వచ్చి, పోరాడాలి. రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయ నేత వేరొకరు ఉన్నారా? కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను చేపట్టడానికి రాహుల్ ఇష్టపడటం లేదని ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం, దేశం కోసం బాధ్యతలు చేపట్టాలని ఆయనను కోరుతాం. ఆరెస్సెస్ , బీజేపీ లపై పోరాడుతూ, దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని విజ్ఞప్తి చేస్తాం’అన్నారు. ‘భారత దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి రాహుల్ గాంధీ అవసరం. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని మళ్లీ చేపట్టాలని ఆయనను కోరుతాం. నిర్బంధిస్తాం. విజ్ఞప్తి చేస్తాం. ఆయనకు మద్ద తుగా మేమంతానిలబడతాం’ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos