కేజ్రీవాల్ నామినేషన్ ఆలస్యం…ఇది భాజపా పనే : ఆప్

కేజ్రీవాల్ నామినేషన్ ఆలస్యం…ఇది భాజపా పనే : ఆప్

ఢిల్లీ :  ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎట్టకేలకు నామినేషన్‌ దాఖలు చేశారు. సుమారు ఆరు గంటలకు పైగా ఆయన నామినేషన్‌ వేసేందుకు క్యూలో ఎదురుచూశారు. కేజ్రీవాల్‌ నామినేషన్‌ ప్రక్రియ ఆలస్యమయ్యేలా చేసేందుకు భాజపా ప్రయత్నించిందని ఆప్‌ ప్రతినిధి సౌరభ్‌ భరద్వాజ్‌ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్‌ వేసేందుకు నేడు చివరి రోజు. సీఎం కేజ్రీవాల్‌ నిన్న నామినేషన్‌ వేసేందుకు ప్రయత్నించినా రోడ్‌షో కారణంగా ఆలస్యమైంది. దీంతో ఆయన నేడు నామినేషన్‌ వేసేందుకు జామ్‌నగర్‌ హౌస్‌కు వెళ్లారు. కానీ ఆయన కంటే ముందు 50 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. దీంతో సీఎం కేజ్రీవాల్‌ క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. కేజ్రీవాల్‌కు టోకెన్‌ నంబరు 45 ఇచ్చారు. దీనిపై ఆప్‌ నేతలు స్పందిస్తూ ఇలా ఆలస్యమవడానికి భాజపానే కారణమంటూ విమర్శలు చేశారు.

‘ఓ చిన్న గదిలో సీఎంతో పాటు 35 మంది కూర్చున్నారు. వాళ్లంతా నామినేషన్‌ ప్రక్రియకు కావాల్సిన సరైన పత్రాలను తెచ్చుకోలేదు. వారి వెంట మద్దతుదారులను తెచ్చుకోలేదు. నామినేషన్‌ ప్రక్రియను ఆలస్యం చేసేందుకే వాళ్లు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఒక్కో నామినేషన్‌కు 30-45 నిమిషాలు సమయం పడుతోంది. నామినేషన్‌కు వచ్చిన వారిలో 40 మందికి పైగా ఒకరికి మరొకరు తెలుసు. నిన్న సీఎం నామినేషన్‌ వేద్దామని అనుకున్న సమయంలో 53 మంది వచ్చారు. కానీ సీఎం నామినేషన్‌ వేయకపోవడంతో వాళ్లు కూడా వేయకుండా వెళ్లిపోయారు. గత నాలుగు రోజులుగా ప్రతిరోజు 50 మంది నామినేషన్‌ వేసేందుకు టోకెన్లు తీసుకుంటున్నారు. కానీ వాళ్లు నామినేషన్‌ వెయ్యడం లేదు. కేజ్రీవాల్‌ను ఇబ్బంది పెట్టాలనే వాళ్లందరూ ఇలా చేస్తున్నారు. దాదాపు ఆరు గంటలకు పైగా సీఎం కేజ్రీవాల్‌ ఎంతో ఓపికగా క్యూలో ఉన్నారు. ఇటువంటి సీఎంను ఇంతకముందెన్నడైనా చూశారా?’ అని ఆప్‌ ప్రతినిధి సౌరభ్‌ వరుస ట్వీట్లు చేశారు.

సౌరభ్‌ చేసిన ఓ ట్వీట్‌కు కేజ్రీవాల్‌ స్పందిస్తూ వేచి చూడటం కూడా సంతోషంగా ఉందని, దాన్ని ఎంజాయ్‌ చేస్తున్నట్లు ఆయన మరో ట్వీట్‌ చేశారు. ‘తొలిసారి నామినేషన్‌ దాఖలు చేసే వాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లు తప్పులు చేస్తుంటారు. మనం కూడా తొలిసారి నామినేషన్‌ వేసే సమయంలో తప్పులు చేశాం. వేచి చూడటం కూడా ఆనందంగా ఉంది. దాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాను. వాళ్లంతా నా కుటుంబంలో భాగమే కదా’ అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. నామినేషన్‌ స్వీకరణకు కేటాయించిన సమయం ముగిసినప్పటికీ టోకెన్లు ఇచ్చిన వారందరి దగ్గర నుంచి నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు స్వీకరిస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos