పరస్పర సహకారంతో అద్భుత ఫలితాలు : కేసీఆర్

పరస్పర సహకారంతో అద్భుత ఫలితాలు : కేసీఆర్

అమరావతి : ఉభయ తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలను రాబట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆకాంక్షించారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో గురువారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్‌. జగన్మోహన్‌ రెడ్డికి అభినందనలు తెలుపుతూ ఆయన ప్రసంగించారు. జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవాన్ని తెలుగు ప్రజల జీవన గమనంలో ఉజ్వల ఘట్టంగా అభివర్ణించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ప్రేమాభిమానాలు, పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తుందని బలంగా విశ్వసిస్తున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నవ యువ ముఖ్యమంత్రి జగన్‌కు తన పక్షాన, తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన కేసీఆర్‌ జగన్‌కు వయసు చిన్నది, బాధ్యత పెద్దదని వ్యాఖ్యానించారు. ఈ బాధ్యతను అద్భుతంగా నిర్వహించగల అభినివేశం, శక్తి, సామర్థ్యం ఉందని గత తొమ్మిదేళ్లుగా జగన్‌ నిరూపించారని కొనియాడారు. తండ్రి నుంచి వచ్చిన వారసత్వంతో ముఖ్యమంత్రి బాధ్యతను సమర్థంగా నిర్వహించగలని ఆకాంక్షించారు. జగన్‌ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని అభిలషించారు. ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు, ప్రభుత్వాలు చేయచాల్సింది కరచాలనమే కానీ ఖడ్గచాలనం కాదని అన్నారు. ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయత, అనురాగంతో  పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలను రాబట్టాలని కోరారు. గోదావరి జలాల సంపూర్ణ వినియోగానికి నడుం బిగించాలని సూచించారు. కృష్ణా జలాలను పొదుపుగా వాడుకుంటూ, జల సమస్యలను ఉభయతారకంగా పరిష్కరించుకోవాలని కోరారు. ఉభయ రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలని కోరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన అండదండలు, సహకారాన్ని తెలంగాణ అందిస్తుందని తెలిపారు. సుపరిపాలనను అందించడం ద్వారా జగన్‌ మరో మూడు, నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగాకొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. అంతకు ముందు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ క్లుప్తంగా ప్రసంగించారు. తెలుగులో అందరికీ నమస్కారం అని అంటూ జగన్‌కు అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని కోరారు.

జగన్‌ విందు

తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన కేసీఆర్‌, స్టాలిన్‌లకు ముఖ్యమంత్రి జగన్‌ అతిథి మర్యాదలు చేశారు. వారిని తన నివాసానికి ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు. అనంతరం కేసీఆర్‌, స్టాలిన్‌లు గన్నవరం విమానాశ్రయం చేరుకుని స్వస్థలాలకు వెళ్లారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos