భాజపా అధ్యక్షుడుగా జేపీ. నడ్డా

భాజపా అధ్యక్షుడుగా జేపీ. నడ్డా

ఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి జేపీ. నడ్డా భాజపా జాతీయ అధ్యక్షుడుగా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి వేరెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు భాజపా ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రకటించారు. ఇప్పటివరకు ఆ పదవిలో కొనసాగిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నడ్డాను అభినందించారు. 59 ఏళ్ల నడ్డా ఏడు నెలల కిందట పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడుగా నియమితులయ్యారు. అప్పట్లో పార్టీ అధ్యక్షుడుగా ఉన్న అమిత్‌ షా కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో ఈ నియామకాన్ని జరపాల్సి వచ్చింది. అధ్యక్షుడుగా ఆయన అభ్యర్థిత్వాన్ని అమిత్‌ షాతో పాటు పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, మాజీ అధ్యక్షులు  ప్రతిపాదించారు. కేంద్ర మాజీ మంత్రి రాధామోహన సింగ్‌ ఈ ఎన్నికను పర్యవేక్షించారు. మోదీ తొలి ప్రభుత్వంలో నడ్డా ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. అంతకు ముందు హిమాచల్‌ప్రదేశ్‌ శాసన సభలో ప్రతిపక్ష నాయకుడుగా వ్యవహరించారు. అధ్యక్ష పదవిని చేపట్టిన నడ్డా  ఢిల్లీ, బిహార్‌ శాసన సభ ఎన్నికల రూపంలో సవాళ్లను ఎదుర్కోనున్నారు. ఆయనకు ముందున్న అమిత్‌ షా 14 శాసన సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించడంతో పాటు 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి అపురూపమైన విజయాన్ని అందించారు. 2014 జులైలో ఈ పదవిని చేపట్టిన అమిత్‌ షా మినహా, అంతకు ముందు భాజపా అధ్యక్షులెవరూ ఇలాంటి ఘనమైన రికార్డును సొంతం చేసుకోలేకపోయారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos