పాత్రికేయుల్ని అక్రమంగా బంధించిన అధికార్లు

పాత్రికేయుల్ని అక్రమంగా బంధించిన అధికార్లు

లఖ్నవూ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం మోరదాబాద్లోని ఆసుపత్రిని సందర్శించినపుడు అక్కడకు వచ్చిన విలేఖరుల బృందాన్ని ఒక గదిలో బంధించటం సోమవారం వెలుగులోకి వచ్చింది. ఆదిత్యనాథ్ను ఆ విలేఖరులు ప్రశ్నించకుండా అడ్డుకునేందుకు జర్నలిస్టుల్ని బంధించినట్లు అధికార్లు తెలిపారు. ‘ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసి మేం ఆసుపత్రికి వచ్చాం. అయితే మమ్మల్ని రెండు గంటల పాటు అత్యవసర గదిలో బంధించారు. ప్రవేశ ద్వారం ఎదుట భద్రతా సిబ్బందిని కూడా కాపాలాగా ఉంచారు. ఆదిత్యనాథ్ వెళ్లిన అరగంట తర్వాత జిల్లా కలెక్టర్ రాకేశ్ కుమార్ సింగ్ వచ్చి తాళం తీశారు. ఆ తర్వాత కూడా మమ్మల్ని ఆసుపత్రి లోపలికి వెళ్ల రాదని హెచ్చరించార’ని విలేకరులు తెలిపారు. ఈ వార్తలను కలెక్టర్ సింగ్ తోసిపుచ్చారు. జర్నలిస్టులను బంధించలేదన్నారు. ఎక్కువ మంది ఉండటంతో వారిని వార్డుల్లోకి వెళ్లొద్దని మాత్రమే చెప్పామన్నారు. ఈ ఘటన వివాదాస్పదమైంది. ప్రభుత్వం తీరును విపక్షాలు తప్పుబట్టాయి. ‘ప్రజా సమస్యలను పట్టించుకోరు. వాటి గురించి ప్రశ్నించే విలేకరులను బంధిస్తారు. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన భాజపా ప్రభుత్వం ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోంది’ అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos