ఆంధ్రప్రదేశ్‌లో దూకుడు పెంచుతున్న బీజేపీ..

ఆంధ్రప్రదేశ్‌లో దూకుడు పెంచుతున్న బీజేపీ..

 దక్షిణాదిలో కీలకరాష్ట్రాలైన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.బీజేపీని బలోపేతం చేసుకునే క్రమంలో అందివచ్చిన ఏచిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదనే ధోరణితో ముందుకు సాగుతోంది.అందులో భాగంగా సీనియర్‌ నేతల నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చినా కండువా కప్పి సాదరంగా ఆహ్వానిస్తోంది.ఇక దేశవ్యాప్తంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రతీ జిల్లాలో ప్రతీ గ్రామంలో నిర్వహిస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ని రోజులు తెదేపాను లక్ష్యంగా చేసుకున్న బీజేపీ కొద్దికొద్దిగా వైసీపీని కూడా లక్ష్యంగా చేసుకుంటూ మాటలు,విమర్శల దాడిని పెంచుతోంది.ఈ క్రమంలో గుంటూరు జిల్లా నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు,మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై,ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేశారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ పాలనకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనకు ఏమాత్రం తేడా లేదని విమర్శించారు.ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో వైఎస్‌ జగన్‌ విఫలమవుతున్నారని చంద్రబాబుకు పట్టిన గతే వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌కు కూడా పడుతుందన్నారు.బాబులానే జగన్ కూడా ఒక కులానికే అధిక ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్న ఆయన కుల రాజకీయాలు చేస్తే ఆయన్ను కూడా ప్రజలు ఇంటికి సాగనంపుతారన్నారు. చంద్రబాబు మోదీని, బీజేపీని టార్గెట్ చేశారని.. తమ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకొన్నారని అందుకే తెదేపా ఎన్నికల్లో ఓటమి తప్పలేదని ఎద్దేవా చేశారు. జగన్ తన తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవన్నారు. బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేసిన ఆయన ఒంటరిగానే పోటీ చేసి అధికారాన్ని దక్కించుకుంటామని తేల్చి చెప్పారు.తమ పార్టీ అధికారం కోసం కాదు.. ప్రజాసేవ కోసం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఒక సాధారణ పార్టీ కార్యకర్తను దేశ ప్రధానిని చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు.ఎన్నడూ లేని విధంగా వైసీపీపై,ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై బీజేపీ విమర్శలతో దూకుడు పెంచుతుండడంతో ఇకపై రాష్ట్రంలో వైసీపీకి తెదేపాతో పాటు బీజేపీ కూడా ప్రధాన ప్రత్యర్థ పార్టీగా మారనుందని రానున్న రోజుల్లో ప్రధాని నరేంద్రమోదీ,ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ల మధ్య కూడా మాటల తూటాలు పేలే అవకాశం ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి..

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos