వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు బలి

వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు బలి

బరేలీ: ఇక్కడి ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యానికి నాలుగు రోజుల పసికందు బలైంది. సుష్మా అనే మహిళ జూన్‌ 15న స్థానిక ప్రయివేటు ఆసుపత్రిలో ఓ ఆడశిశువుకు జన్మనిచ్చింది. బుధ వారం ఉదయం చిన్నారి శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడటంతో ఉత్తమ చికిత్స కోసం మహారాణా ప్రతాప్‌ ప్రభుత్వాసు పత్రి అవుట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్కి తీసుకెళ్లారు. విధి నిర్వహణలోని వైద్యులు చిన్నారిని పరీక్షించకుండా బాలల విభాగానికి తీసుకెళ్లమన్నారు. దీంతో తల్లి దండ్రులు అక్కడకు పసిబిడ్డను తీసుకెళ్లారు. అక్కడ మంచాలు ఖాళీగా లేనందున ఓపీడీకే వెళ్లమని సిబ్బంది తిప్పి పంపారు. దాదాపు మూడు గంటల పాటు చిన్నారితో సుష్మ దంపతులు వైద్యుల చుట్టూ తిరిగారు. చికిత్స అందకపోవడంతో వేరే ఆసుపత్రికి తీసుకెళుతుండగా ప్రభుత్వాసుపత్రి మెట్ల పైనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను పోగొట్టుకున్నామని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.వైద్యుల నిర్వాకం అధికారుల దృష్టికి వెళ్లడంతో సిబ్బందిపై చర్యలు చేపట్టి దర్యాప్తునకు ఆదేశించారు. చిన్నారి మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘బరేలీ ఘటన విచారకరం. ఆసుపత్రిలో పురుషుల విభాగంలోని డ్యూటీ డాక్టర్‌ను సస్పెండ్‌ చేయాలని ఆదేశించా. మహిళల విభాగంలోని డాక్టర్లపై కూడా దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ చేశాం. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం’ అని ట్విటర్‌లో తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos