ప్లాస్టిక్‌తో పెట్రోల్..

ప్లాస్టిక్‌తో పెట్రోల్..

ప్రపంచ దేశాల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలతో ముడిచమురు ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభావం భారతదేశంపై స్పష్టంగా కనిపిస్తోంది.దేశంలో రోజురోజుకు పెట్రోల్‌ ధరలు పెరుగుతూనే ఉండడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు.ధరలు పెరుగుతున్నా ఉద్యోగాలు,వ్యాపారాల కోసం వాహనాలు తప్పనిసరిగా వినియోగించాల్సిన పరిస్థితులు ఉండడంతో తమ దురదృష్టాన్ని మనసులో తిట్టుకుంటూనే పెట్రోల్‌ బంకుల్లో బారులు తీరుతున్నారు.పెట్రల్‌ ధరలు పెరగడంతో ప్రత్యామ్నాయ ఇంధనాల తయారీపై పరిశోధనలు జరుపుతున్నా ఫలితాలు మాత్రం సానులకూలంగా రాకపోవడంతో కొత్త మార్గాల కోసం శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.మరోవైపు ఇంధన ధరలు భరించలేక ప్రజలు ఎలక్ట్రిక్‌ వాహనాలపై మొగ్గు చూపుతుండడంతో వాహన తయారీ సంస్థలు కూడా విద్యుత్‌శక్తితో నడిచే వాహనాల తయారీపై దృష్టి సారించాయి.ఈ తరుణంలో హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ మెకానికల్‌ ఇంజనీర్‌ ప్లాస్టిక్‌తో పెట్రోల్‌ తయారు చేయడం సంచలనంగా మారింది.హైదరాబాద్‌ నగరానికి చెందిన సతీశ్‌కుమార్‌ అనే మెకానికల్‌ ఇంజనీర్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తుల నుంచి పెట్రోల్‌ తయారు చేశారు.అందుకు సంబంధించి సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల శాఖ వద్ద తన కంపెనీని రిజిస్టర్ చేయించిన సతీశ్‌కుమార్‌ పెట్రోల్‌ ఎలా తయారు చేస్తారో కూడా విపులంగా వివరించారు.ప్లాస్టిక్ పైరాలసిస్ అనే పద్ధతిలో మూడు స్టెప్పుల్లో ప్లాస్టిక్‌ను ఫ్యూయల్‌గా మారుస్తున్నారు. ప్లాస్టిక్‌ను డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్, పెట్రోల్‌గా రీసైకిల్ చేస్తారు. దాదాపు 500 కిలోల నాన్ రీసైక్లబుల్ ప్లాస్టిక్‌తో 400 లీటర్ల ఫ్యూయల్ ఉత్పత్తి చేయవచ్చు.ఈ ప్రక్రియకు అసలు నీటి అవసరమే ఉండదని అదేవిధంగా ప్రక్రియలో వ్యర్థ జలాలు కూడా ఉత్పన్నం కావని సతీశ్‌ తెలుపుతున్నారు.2016 నుంచి 50 టన్నుల ప్లాస్టిక్‌ను (రీసైకిల్ కాలేని ప్లాస్టిక్) ఫ్యూయల్‌గా మార్చామని  ప్రస్తుతం ఇతని కంపెనీ రోజుకు 200 లీటర్ల పెట్రోల్‌ను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. అందుకు 200 కిలోల ప్లాస్టిక్‌ను వినియోగించాల్సి వస్తుందని ఇలా ఉత్పత్తి చేసిన దానిని లీటరుకు రూ.40 నుంచి రూ.50 స్థానిక పరిశ్రమలకు విక్రయిస్తున్నామన్నారు.కాగా, ప్లాస్టిక్ నుంచి ఉత్పత్తి చేస్తున్న ఈ ఫ్యూయల్‌ను వాహనాలకు వినియోగించవచ్చా లేదా అనేది పరీక్షించవలసి ఉందని తెలిపారు. పీవీసీ (పాలీ వినైల్ క్లోరైడ్), పీఈటీ (పాలీ ఇథలైన్ టెరిప్థలేట్) మినహా ఫ్యూయల్ కోసం ఏ ప్లాస్టిక్‌ను అయినా వినియోగించవచ్చని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ తమ లక్ష్యమని, తమకు ఎలాంటి కమర్షియల్ బెనిఫిట్స్ అవసరం లేదని, పర్యావరణ పరిరక్షణ కోసం తమవంతు కృషి చేస్తున్నామని, ఆసక్తి కలిగిన ఎంటర్‌ప్రెన్యూయర్స్‌తో తమ టెక్నాలజీని షేర్ చేసుకునేందుకు సిద్ధమని సతీష్ కుమార్ చెప్పారు.

పెట్రోల్ తయారు చేస్తున్న సతీశ్‌..

సతీశ్‌ తయారు చేసిన పెట్రోల్

 

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos