విలీనంపై విచారణ బుధవారానికి వాయిదా..

విలీనంపై విచారణ బుధవారానికి వాయిదా..

ప్రతిపక్షాన్ని అధికార పక్షంలో విలీనం చేయడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరిపోవడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు తగ్గింది.ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు తగ్గింది.దీంతో తెరాసలో చేరిన 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలంటూ స్పీకర్‌కు లేఖ ఇవ్వడం సభాపతి విలీనానికి ఆమోదించడం చకచకా జరిగిపోయాయి.ఈ విలీనం రాజ్యాంగ విరుద్దమని ఆరోపించిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు విలీనాన్ని సవాల్‌ చేస్తూ రెండు రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.దీంతో పాటు తెరాసలో చేరతామని ప్రకటించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్‌ నేతలు గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు.ఈ రెండు పిటిషన్లను బుధవారం ఒకేసారి విచారణ చేస్తామంటూ హైకోర్టు స్పష్టం చేసింది.విలీనాన్నినిరసిస్తూ కాంగ్రెస్ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క  ఇందిరా పార్క్ వద్ద దీక్షకు కూడ దిగిన విషయం తెలిసిందే.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos