‘కథానాయకుడు‌’ ఎన్ని కోట్లు రాబట్టాడంటే?

  • In Film
  • January 11, 2019
  • 187 Views
‘కథానాయకుడు‌’ ఎన్ని కోట్లు రాబట్టాడంటే?

హైదరాబాద్‌: భారీ తారాగణం, అంచనాల మధ్య విడుదలైన ‘యన్‌.టి.ఆర్‌-కథానాయకుడు’ సినిమా బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లుతో రాణిస్తోంది. ఈ సినిమా తొలి రోజున (బుధవారం) రూ.21 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.7.61 కోట్లు రాబట్టినట్లు చెప్పారు. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.8.77 కోట్లు రాబట్టినట్లు అంచనా వేశారు. రెండో రోజుకు సంబంధించి పూర్తి వసూళ్లు తెలియాల్సి ఉంది. విదేశాల్లోనూ చిత్రం విశేషమైన వసూళ్లు రాబడుతోంది. సంక్రాంతి పండుగ సెలవులు, వారాంతం నేపథ్యంలో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది.

తెలుగువారి అభిమాన నటుడు ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా తీసిన సినిమా ‘యన్‌.టి.ఆర్‌-కథానాయకుడు’. తొలి భాగాన్ని జనవరి 9న విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండో భాగం ‘యన్‌.టి.ఆర్‌-మహానాయకుడు’ను ఫిబ్రవరి 7న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో తన తండ్రి ఎన్టీఆర్‌గా కనిపించారు. క్రిష్‌ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎన్బీకే ఫిల్మ్స్‌‌ పతాకంపై బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాను వారాహి చలన చిత్రం సంస్థ సమర్పించింది. ఇందులో బసవతారకంగా విద్యా బాలన్‌, నారా చంద్రబాబుగా రానా, హరికృష్ణగా కల్యాణ్‌రామ్‌ నటించారు.

‘యన్‌.టి.ఆర్‌-కథానాయకుడు’ మంచి టాక్‌ అందుకున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థ సోషల్‌మీడియాలో ఆనందం వ్యక్తం చేసింది. ‘ఇది చరిత్రాత్మక విజయం, తెలుగు ప్రజల విజయం, తెలుగు సినిమా విజయం..’ అంటూ పోస్టర్లు విడుదల చేసింది. ‘యన్‌.టి.ఆర్‌-మహానాయకుడు’ సినిమాకు సంబంధించి ఇంకా పది రోజుల షూటింగ్‌ మాత్రమే ఉందని ఇటీవల బాలకృష్ణ చెప్పారు. రెండో భాగం కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos