వెంటిలేటర్లు సమకూర్చాలి : గోపీనాథ్

వెంటిలేటర్లు సమకూర్చాలి : గోపీనాథ్

హోసూరు : లాక్ డౌన్ కారణంగా హోసూరులోని నాయకులు ప్రజలకు చేయూతనందిస్తున్నా, ప్రజల ఆరోగ్యం విషయం పట్టించుకొంటే మంచిదని మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ అన్నారు. కరోనా నివారణలో భాగంగా తమిళనాడులో కూడా లాక్ డౌన్ కొనసాగుతున్నా, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా స్థానిక నాయకులు పేదలకు నిత్యావసరాలు అందిస్తూ ఆదుకొంటుండడం హర్షించదగ్గ విషయమంటూనే, ప్రజల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలని కోరారు. హోసూరు ప్రాంతంలోని ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రులలో కలిపి 20కి మించి వెంటిలేటర్లు లేవని ఆయన అన్నారు. హోసూరు ప్రాంత ప్రభుత్వాస్పత్రులలో తగినన్ని వెంటిలేటర్ల ఏర్పాటు ఎంతైనా అవసరమన్నారు. అదేవిధంగా ప్రభుత్వాస్పత్రులలో మాస్కులు,ఔషధాల కొరత ఉన్నట్లు తెలిసిందని తెలిపారు. ప్రస్తుత ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హోసూరు పారిశ్రామికవాడలోని బేగేపల్లిగ్రామానికి ఈ నెల 14 వతేదీ కరోనా వ్యాధి సోకిన ఓ వ్యక్తి వచ్చివెళ్లినట్లు వార్తా పత్రికలలో వార్తలు ప్రచురితమైయ్యాయని, 18వ తేది అధికారులు గ్రామాన్ని సీల్ డౌన్ చేయడం జరిగిందని తెలిపారు. సోమవారం ఉన్నతాధికారుల బృందం చెన్నై నుండి బేగేపల్లి గ్రామానికి వచ్చి వెళ్లడం వల్ల ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ప్రభుత్వాస్పత్రులలో సౌకర్యాలు మెరుగు పరిచేందుకు నాయకులు అధికారులవద్ద డిమాండ్ చేయాలని అన్నారు. ఇకనైనా నాయకులు మేల్కొని ప్రభుత్వాస్పత్రులలో వసతుల ఏర్పాటుకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే గోపినాథ్ డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos