బీసీసీఐ నుంచి గంగూలీ ఔట్,..బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం

బీసీసీఐ నుంచి గంగూలీ ఔట్,..బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారం

న్యూ ఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడి పదవికి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ దాదాపు దూరమైనట్టే. దీని గురించి సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. బీజేపీ రాజకీయ ప్రతీకార చర్య అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆయన స్థానంలో భారత్కు 1983 లో ప్రపంచ కప్ తీసుకొచ్చిన హీరోగా పేరొందిన రోజర్ బిన్నీ.. బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టం ఖాయంగా తెలుస్తోంది. రాజకీయ ప్రతీకారానికి ఇది మరో ఉదాహరణ అని టీఎంసీ ఎంపీ శంతను సేన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘అమిత్ షా కుమారుడిని బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగించవచ్చు. కానీ గంగూలీ మాత్రం కొనసాగించరు. అతను పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారా? లేక బీజేపీలో చేరలేదా? మేము మీతో ఉన్నాం దాదా!’’ అని శంతను సేన్ పేర్కొన్నారు. అలాగే శంతను సేన్ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఏడాది మేలో గంగూలీస్ నివాసానికి విందు కోసం వచ్చారని అన్నారు. గంగూలీని బీజేపీలో చేరాలని అమిత్ షా చాలాసార్లు కోరారని చెప్పుకొచ్చారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా గంగూలీ మారాలని అమిత్ షా కోరుకున్నార న్నారు. దీన్ని తిరస్కరించినందుకే గంగూలీ అధ్యక్ష పదవిని లాగేసుకున్నారని ఆరోపించారు. ఇది కేవలం రాజకీయంగా ప్రభావితమైన చర్య మాత్రమే కాదని.. క్రీడలను చౌకగా కాషాయీకరణ చేయడమేనని అన్నారు. బీజేపీ అన్ని అత్యున్నత నిర్వాహక పదవులను వారి నాయకుల కుటుంబ సభ్యులకే కేటాయించిందని విమర్శించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos