టీపీసీసీకి నూతన సారథి

టీపీసీసీకి నూతన సారథి

హైదరాబాదు : చాలాకాలంగా వాయిదా పడుతోన్న టీపీసీసీ సారథి నియామకానికి ఎట్టకేలకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చించి వారి అభిప్రాయం సేకరించిన తర్వాతే సారథి నియామకం ఉంటుందని సమాచారం. కొత్త సారథితో పార్టీ నాయకులు, శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడం, పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై అధిష్ఠానం తీవ్రంగా ఆలోచిస్తోందని త్వరలోనే పలు కీలక నిర్ణయాలు ఉంటాయని ఏఐసీసీ కీలక బాధ్యులు ఒకరు తెలిపారు. ‘పీసీసీ సారథి నియామకం, ఇతర పదవుల భర్తీ, జిల్లా, ప్రదేశ్ కాంగ్రెస్ సమితి కార్యవర్గాల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలపై అధిష్ఠానం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభమ వు తుంది. సామాజిక సమీకరణలు, నేతల అభిప్రాయాలను పరిగణిస్తారు. సమష్టిగా ముందుకెళ్లడమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుంది. పదవుల్లో సమతూకం పాటిస్తాం. అనుబంధ విభాగాలనూ బలోపేతం చేస్తాం. మాణికం ఠాగూర్ అభిప్రాయాలను మాకు తెలుపుతార’ని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రేవంత్రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, డి.శ్రీధర్బాబు, జగ్గారెడ్డి పీసీసీ పీఠం రేసులో ఉన్నారు. తనకు ఈ పదవి ఇవ్వాలని ఇప్పటికే కోమటిరెడ్డి ఏఐసీసీ నేతలను కోరారు. ఈ సారి పదవి తనకు ఖాయమని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే రేవంత్రెడ్డి.. ఏఐసీసీ నేతలతో సన్నిహితంగా ఉన్నారు. 2023 ఎన్నికల్లో తెరాస, భాజపాలను ఎదుర్కొనేలా పార్టీని సన్నద్ధం చేయగలిగే వారికే పీఠం అప్పగించాలని కొందరు ఇప్పటికే ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జికి నివేదించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos