అటవీ స్మగ్లర్లపై కెమెరా కన్ను

అటవీ స్మగ్లర్లపై కెమెరా కన్ను

ఆదిలాబాద్ కవ్వాల్, నాగర్‌కర్నూల్ అమ్రాబాద్ పెద్దపులుల అభయారణ్యాల్లో వన్యప్రాణుల భద్రతకు అటవీశాఖ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. టైగర్ కారిడార్లలో అడుగడుగున కెమెరా ట్రాప్‌లను అమర్చుతున్నారు. పెద్దపులుల సంరక్షణకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. దాదాపు 2015 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న కవ్వాల్‌లో వేటగాళ్ల కదలికలు ఉన్నట్టు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) వైల్డ్‌లైఫ్ క్రైం కంట్రోల్‌బ్యూరో హెచ్చరికలు జారీచేసింది. ఇచ్చోడలో ఇటీవలనే పెద్దపులిని చంపి తోలు ఒలిచిన కేసు సంచలనం సృష్టించింది. కవ్వాల్ అభయారణ్యంలోకి మహారాష్ట్ర తడోబా అంథేరి టైగర్ రిజర్వ్, ఛత్తీస్‌గఢ్ ఇంద్రావతి నుంచి పులులు వలస వస్తున్నాయి. మార్గమధ్యలో అనువైన గడ్డిమైదానాలు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు.. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల మధ్య అడవులను ధట్టంగా పెంచాలని నిర్ణయించారు. కవ్వాల్‌లో 400 నుంచి 500 కెమెరాలు, అమ్రాబాద్‌లో 400 నుంచి 450 కెమెరా ట్రాప్‌లను అమర్చి వలస వస్తున్న పులుల జాడలతోపాటు స్మగ్లర్ల కదలికలను పసిగడుతున్నారు. మహారాష్ట్ర తడోబా నుంచి కాగజ్‌నగర్‌కు వచ్చే పులుల కారిడార్లో దాదాపు 240 కెమెరా ట్రాప్‌లను అమర్చారు.
రంగంలోకి ప్రత్యేక డాగ్‌స్వాడ్లు
పెద్దపులుల అభయారణ్యాల్లో కుక్కల కాపలా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలోభాగంగా కవ్వాల్, అమ్రాబాద్ పులుల అభయారణ్యాలకు రెండు డాగ్‌స్వాడ్లను కేటాయించింది. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జర్మన్ షెపర్డ్ కుక్కలతోపాటు సిబ్బందికి శిక్షణనిచ్చి అడవులకు పంపారు. దేశవ్యాప్తంగా పెద్దపులుల రక్షణ సవాల్‌గా మారిన నేపథ్యంలో.. కేంద్ర అటవీ, పర్యావరణశాఖ డాగ్‌స్వాడ్లను రంగంలోకి దించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos