అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు

అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు

మహబూబాబాద్‌: తెలంగాణ విద్యార్థిపై అమెరికాలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. మిషిగన్‌ రాష్ట్రం డెట్రాయిట్‌ నగరంలో 3వతేదీ అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం) జరిగిన ఘటనలో మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన పూస సాయికృష్ణ(24) తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

హైదరాబాద్‌లోని కె.ఎస్‌.రాజు ఇంజినీరింగ్‌ కళాశాలలో సాయికృష్ణ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివాడు. ఎంఎస్‌ చేయడానికి 2014లో అమెరికాకు వెళ్లాడు. మిషిగన్‌ రాష్ట్రం డెట్రాయిట్‌లోని లారెన్స్‌ టెక్‌ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ పూర్తి చేశాడు. ఏడాదిగా ఉద్యోగ వేట కొనసాగిస్తూ నెల రోజుల కిందటే అక్కడి ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. 3న రాత్రి ఓ హోటల్‌ నుంచి తాను ఉంటున్న గదికి వస్తుండగా గుర్తు తెలియని ఆగంతకులు అతనిపై కాల్పులు జరిపినట్టు సమాచారం. అనంతరం దుండగులు సాయికృష్ణ వద్ద ఉన్న నగదు, ఇతర పత్రాలు తీసుకుని పరారైనట్టు తెలిసింది. నెత్తుటి మడుగులో ఉన్న బాధితుణ్ని ట్రాఫిక్‌ పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉండడంతో అక్కడి వైద్యులు మహబూబాబాద్‌లో ఉంటున్న అతని తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు. ‘గొంతు, వెన్నుపూస వద్ద శస్త్ర చికిత్స చేస్తున్నామని, రక్తం అవసరమైతే ఎక్కిస్తామని, వైద్యపరంగా అందించాల్సిన సేవలన్నింటినీ అందిస్తామని వాళ్లు మాతో చెప్పారు. మేము అంగీకరించిన తర్వాతనే శస్త్ర చికిత్స చేశారు’ అని సాయికృష్ణ తల్లిదండ్రులు శైలజ, ఎల్లయ్య ‘ఈనాడు’తో చెప్పారు. ‘ఇప్పటివరకు మా కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడనే భావిస్తూ వచ్చాం. కాల్పులు జరిగినట్లు ఇప్పుడే తెలిసింది. కుడి చేతిపైన, మెడపైన బుల్లెట్‌ గాయాలున్నట్టు సమాచారం అందింది. అసలు అక్కడ ఏం జరిగిందోననే ఆందోళన వెంటాడుతోంది’ అని వారు రోదించారు. ఆమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. ఎల్లయ్య ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos