కష్ట కాలంలోనూ హొసూరు రైతు దొడ్డ మనసు

కష్ట కాలంలోనూ హొసూరు రైతు దొడ్డ మనసు

హొసూరు : కరోనా ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడమే కాక రైతుల బతుకు కూడా బజారున పడింది. ఒకపక్క దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో పరిశ్రమలు వాణిజ్య సముదాయాలు అన్నీ మూతపడ్డాయి. భారీ పరిశ్రమల నుండి  చిన్న పరిశ్రమల వరకు దేశవ్యాప్తంగా మూతపడడంతో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు రోడ్డున పడ్డారు. పరిశ్రమలలో కార్మికుని చెమటను దోచుకున్న యాజమాన్యాలు లాక్ డౌన్ ప్రభావంతో వారిని కాపాడలేక చేతులెత్తేశా యి. లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలే కాక రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా హొసూరు ప్రాంతంలో పరిశ్రమలతో పాటు వ్యవసాయం కూడా జోరుగా సాగుతున్నది. లాక్ డౌన్  కారణంగా హోసూరు ప్రాంత రైతులు పండించిన పంటలు ఇతర రాష్ట్రాలకు రవాణా చేసేందుకు వాహనాలు లేకపోవడంతో క్యాప్సికం, బీన్స్ బంగాళాదుంపలు, క్యారెట్, బీట్ రూట్ తదితర కూరగాయలే కాక పాలీహౌస్ లలో సాగుచేస్తున్న రోజా, జర్బరా, కార్నేషన్ తదితర పూలు కూడా గిట్టుబాటు ధర లేక చెత్త కుప్పలో పడేశారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో పండించిన పంటలు అమ్ముకునే గతిలేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులు సంక్షోభంలో కూరుకుపోయి నా, ఎన్ని కష్టాలు ఎదుర్కొనా గుండె నిబ్బరంతో దేశ ప్రజానీకానికి ఏ లోటు లేకుండా ఆహార ఉత్పత్తులను పండిస్తూ అందర్నీ అక్కున చేర్చుకున్నారు. ఈ సంక్షోభ సమయంలో కూడా హొసూరు రైతులు ముఖ్యమంత్రి సహాయనిధికి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు కృష్ణగిరి జిల్లా హార్టికల్చర్ ఫెడరేషన్ అధ్యక్షులు వెంకటా చలపతి అధ్యక్షతన హొసూరు ప్రాంత రైతులు 3 లక్షల 25 వేల రూపాయల డీడీని కృష్ణగిరి జిల్లా కలెక్టర్ ప్రభాకరన్ చేతికి అందజేశారు. కష్టాల్లో ఉన్న రైతులు కూడా మేము సైతం అంటూ ముందుకు వచ్చి రాష్ట్ర శ్రేయస్సుకు ఆర్థిక సహాయం చేసినందుకు జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos