క్విట్‌ డబ్ల్యూటీవో

క్విట్‌ డబ్ల్యూటీవో

న్యూఢిల్లీ : క్విట్ ”డబ్ల్యూటీవో” డిమాండ్తో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. దేశంలోని 400 జిల్లాల్లో రహదారులపై ట్రాక్టర్ పరేడ్, డబ్ల్యూటీవో దిష్టిబొమ్మ దహనాలను రైతులు నిర్వహించారు. డబ్ల్యూటీవో నుంచి ఇండియా నిష్క్రమించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఇచ్చిన పిలుపును రైతులు సోమ వారం దేశవ్యాప్తంగా జయప్రదం చేశారు. ఈ సందర్భంగా ఎస్కేఎం నేతలు మాట్లాడుతూ పంజాబ్ను ఏకాకిని చేసి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల ప్రయోజనం పొందాలనే ప్రయత్నంలో పంజాబ్ రైతులపై తీవ్ర అణచివేతకు కేంద్ర హౌంమంత్రి అమిత్ షా కుట్ర పన్నుతున్నారని తీవ్రంగా ధ్వజ మెత్తారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, హౌం మంత్రి అనిల్ విజ్ చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర సరిహద్దుల గుండా బలగాలను పంపి రైతులపై బుల్లెట్లు, పెల్లెట్లు, టియర్ షెల్స్ కాల్చారని, అక్కడ నిలబడి ఉన్న వందలాది రైతుల ట్రాక్టర్లను ధ్వంసం చేశారని విమర్శించారు. అనంతరం రైతులను రోడ్లపైకి ట్రాక్టర్లను తీసుకురావద్దని ఆదేశించారని దుయ్యబట్టారు. రైతుల ఆస్తుల కూల్చివేతకు బుల్డోజర్ రాజ్ వంటివి ఆచరిస్తున్నారని, ఈ రైతు వ్యతిరేక దాడిని నిరసిస్తూ ఎస్కేఎం రోడ్లపై ట్రాక్టర్లను నిలబెట్టి నిరసన సభలు నిర్వహించిందని తెలిపారు. సి2 ప్లస్ 50 శాతం లాభదాయక రేటుతో ఎంఎస్పీకి చట్టపరమైన హామీ, చౌకైన రేషన్ దేశంలోని రైతులు, శ్రామిక జనాభా మనుగడకు ఉమ్మడి అవసరాలని ఎస్కేఎం నాయకులు వివరించారు. మతపరమైన ముసుగులో కప్పబడిన ప్రభుత్వ విధానం, వ్యవసాయంలో విదేశీ పెట్టుబడిని, బడా కంపెనీలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ”ఇన్పుట్ ధరలను పెంచుతోంది. పంటల అమ్మకపు ధరలను తగ్గించడం, ఆహార సరఫరా గొలుసును నియంత్రించడం, భూమి, నీటి వనరులను స్వాధీనం చేసుకోవడం, తద్వారా రైతు ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోంది” అని విమర్శించారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని అమలు చేయడమే కాక, ధనిక దోపిడీదారుల లాభార్జన అవసరాల కోసం ప్రజలపై ఫాసిస్ట్ అణచివేతకు పూనుకుంటోందని ధ్వజమెత్తారు.
కనీస మద్దతు ధర విధానాన్ని ఉపసంహరించుకోవాలన్న డబ్ల్యూటీవో డిమాండ్ దేశంలోని కోట్లాది మంది రైతులపై దాడి మాత్రమే కాదని, దేశ సార్వభౌమాధికారంపై కూడా దాడి అని పేర్కొన్నారు. ఇలాంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశంపై రుద్దబడుతున్నాయని, రైతులకు, దేశ పౌరుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. సంయుక్త కిసాన్ మోర్చా మార్చి 14న ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో భారీ కిసాన్ మహాపంచాయత్ను నిర్వహించనుందని, ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పాల్గొననున్నారని తెలిపారు.
డబ్ల్యూటీవో నుంచి బయటకొస్తేనే… :ఏఐకేఎస్, ఏఐఎడబ్ల్యూయూ నేతలు కృష్ణప్రసాద్, బి వెంకట్
దేశ వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసే డబ్ల్యూటీవో షరతులను భారత ప్రభుత్వం ప్రతిఘటించాలని ఏఐకేఎస్ కోశాధికారి కృష్ణ ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. అబుదాబిలో జరుగుతున్న డబ్ల్యూటీవో సదస్సులో భారత ప్రభుత్వం సంపన్న దేశాల షరతులను అంగీకరించరాదని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos