కొత్త అసెంబ్లీని నిర్మిస్తే ఏం?

కొత్త అసెంబ్లీని నిర్మిస్తే ఏం?

హైదరాబాద్‌ : పోరాడి సాధించుకున్న రాష్ట్రం కొత్త శాసన సభ భవనాన్ని ఎందుకు నిర్మించుకోకూడదని హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఎర్రమంజిల్‌ భవనం కూల్చివేతపై బుధవారం వాదనలు జరిగాయి. కొత్త భవనాన్ని నిర్మించుకోకూడదని తాము చెప్పడం లేదని, ఎర్రమంజిల్‌ భవనాలు వారసత్వ కట్టడాల జాబితాలో ఉన్నందున, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాత్రమే గుర్తు చేస్తున్నామని పిటిషనర్‌ తరఫు న్యాయవాది నళిన్‌ కుమార్‌ విన్నవించారు. పురాతన కట్టడాల బాధ్యత ప్రభుత్వానిదేనని రాజ్యాంగం చెబుతోందని, గతంలో సుప్రీం కోర్టు కూడా చెప్పిందని గుర్తు చేశారు. అయితే హెచ్‌ఎండీఏ చట్టంలో ఉన్న 13వ నిబంధనను తొలగించినందున, అది వారసత్వ కట్టడాల పరిధిలోకి రాదని ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదించారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, హెచ్‌ఎండీఏకు వారసత్వ కట్టడాల జాబితాలో ఉన్న వాటిని తొలగించడం లేదా కొత్త వాటిని చేర్చడంపై అధికారం ఉందో, లేదో చెప్పాలని పిటిషనర్‌కు సూచించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

తాజా సమాచారం