మొసలి మరణిస్తే.. ఊరు కన్నీరు

మొసలి మరణిస్తే.. ఊరు కన్నీరు

మనిషికి, జంతువులకు మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని మాటల్లో వర్ణించలేం. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ ఊరు మొసలిని ఏకంగా తమ దైవంగా, సంరక్షుకురాలిగా భావిస్తూ ఆరాధనాభావంతో పూజలు చేస్తున్నది. 130 ఏండ్ల పాటు జీవించిన ఈ మకరం అకస్మాత్తుగా మరణించడంతో గ్రామమంతా శోకసంద్రమైంది. ఒక్క ఇంట్లో కూడా పొయ్యి వెలుగలేదు. ఊరుఊరంతా పస్తులున్నారు. ఈ ఆసక్తికరమైన సంఘటన రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 80 కి.మీ. దూరంలోని బెమితార జిల్లా బావ మహోతార గ్రామంలో చోటుచేసుకున్నది. ఊరి చెరువులో ఉంటున్న 130 ఏండ్ల మొసలిని గ్రామస్థులంతా దైవంగా భావిస్తారు. తమ సంరక్షుడైన మకరానికి ఏకంగా గంగారామ్ అని నామకరణం చేశారు. అయితే, వయోభారంతో మకరం కన్నుమూయడంతో ఊరిలో విషాదం నెలకొంది. ప్రజలంతా సంప్రదాయ పద్ధతిలో, భక్తి ప్రపత్తులతో మొసలి అంత్యక్రియలు నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు.ప్రతి ఒక్కరు మకరాన్ని తాకి కడసారి ఆశీర్వాదాలు పొందారు. మొసలి శతాబ్దానికిపైగా నివసించిన చెరువు ఒడ్డునే దానికి స్మారకం, గ్రామంలో దేవాలయం నిర్మించనున్నట్లు గ్రామ సర్పంచ్ మోహన్ సాహు చెప్పారు. మా తాత తన చిన్నతనంలో ఈ మొసలిని చూశాడు. ఇది మా ఊరి దేవత. గ్రామస్థులు, చిన్నారులు చెరువులో ఈదుకుంటూ మకరం సమీపంలోకి వెళ్లినా ఎన్నడూ హాని తలపెట్టలేదు అని పేర్కొన్నారు. 3.4 మీటర్ల పొడవు, 250 కిలోల బరువు ఉన్న గంగారామ్ వయస్సు 130 ఏండ్లు ఉంటుందని అటవీశాఖ అధికారి ఆర్కే సిన్హా చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos