హోసూరు ప్రాంతంలో ఒంటరి ఏనుగు స్వైర విహారం : మరొకరి మృతి

హోసూరు ప్రాంతంలో ఒంటరి ఏనుగు స్వైర విహారం : మరొకరి మృతి

హోసూరు : హోసూరు ప్రాంతంలో ఒంటరి ఏనుగు దాడుల్లో అమాయకులు నేలకొరుగుతున్నారు. గత 15 రోజుల్లో ముగ్గురు రైతులు మృతువాత పడ్డారు. కృష్ణగిరి జిల్లా డెంకణీకోట చుట్టుపక్కల దట్టమైన అటవీ ప్రాంతం వుంది. ఈ అడవిలో వందల సంఖ్యలో ఏనుగులు సంచరిస్తున్నాయి. ఈ ఏనుగుల మంద నుంచి వేరుపడిన ఓ ఏనుగు గ్రామీణ ప్రాంతాలలో సంచరిస్తూ పొలంలో పనులు చేసుకుంటున్న వారిపై, పశువుల కాపారులపై దాడి చేసి చంపేస్తున్నది. 15 రోజుల క్రితం తిమ్మరాయప్ప అనే రైతును హతమార్చిన ఒంటరి ఏనుగు రెండు రోజుల తరువాత చెన్నప్ప అనే గొర్రెల కాపరిని చంపేసింది. ఈ రెండు సంఘటనలు జరిగి 15 రోజులు కాక ముందే బుధవారం డెంకణీకోట సమీపంలోని మేకలగౌనూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ తన పొలంలో పండించిన కూరగాయలను
డెంకణీకోట రైతు బజారుకు తీసుకెళుతుండగా ఆ ప్రాంతంలో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు అతనిపై దాడి చేసింది. ఈ సంఘటనలో శ్రీనివాస్‌ తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మరణించాడు. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. గత 15 రోజుల్లో ముగ్గురిని పొట్టనపెట్టుకున్న ఒంటరి ఏనుగు వల్ల డెంకణీకోట ప్రాంతంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో మోస్తరుగా వర్షాలు కురవడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాల్సిన తరుణంలో ఒంటరి ఏనుగు వల్ల పొలాలకు వెళ్లడానికి జంకుతున్నారు. వరుసగా ముగ్గురు రైతుల ప్రాణాలను హరించిన ఏనుగును పట్టుకుని దూర ప్రాంత అడవికి తరలించడానికి అధికారులు చర్యలు చేపట్టక పోతే మరికొందరు మృత్యువాత పడాల్సిందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి పలువురి ప్రాణాలను తీసిన ఏనుగును పట్టుకుని దట్టమైన అటవీ ప్రాంతానికి తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos