యడ్యూరప్పకు అసమ్మతి బెడద

యడ్యూరప్పకు అసమ్మతి బెడద

బెంగళూరు: ముఖ్యమంత్రి యడ్యూరప్ప ముంగళవారం చేసిన మంత్రి వర్గ విస్తరణ సీనియర్ నేతల్లో అసంతృప్తి అగ్నికి ఆజ్యాన్ని పోసింది. అయితే వారికి అధిష్ఠానంలో అండగా నిలిచేవారు లేక పోవటం యడ్యూరప్పకు కాస్త ఊరట. దీనికి తోడు యడ్యూరప్ప కొలువులోని సభ్యుల్ని అధినాయకత్వమే ఎంపిక చేసినందున అసమ్మమతి అగ్నిని ఆర్పే బాధ్యత కూడా వారిపైనే ఉందని యడ్యూరప్ప అనూయాయుల అభిప్రాయం. సీనియర్ నేతలు ఉమేష్ కత్తి, మురుగేశ్ నిరాని, బాలచంద్ర జార్కిహోళి, రేణుకాచార్య, బసవరాజ్ పాటిల్ యత్నాల్ తదితరులు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి దూరమయ్యారు.
తిప్పారెడ్డి అసంతృప్తి…రోడ్డెక్కిన మద్దతుదారులు
‘మంత్రుల జాబితా తనకు ఆశ్చర్యాన్ని, బాధను కలిగించింద’ని పదవిని ఆశించిన దక్కక పోవటంతో నిరాశ చెందిన చిత్రదుర్గ శాసనసభ్యుడు జీహెచ్.తిప్పారెడ్డి ఆవేదన చెందారు. ఇది వరకూ నాలుగు మార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భావ సారూప్యత కలిగిన ఎమ్మెల్యేలతో సమావేశమై విధేయులైన శానససభ్యులను మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తామని, భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చిస్తామని తెలిపారు. చిత్రదుర్గలో తిప్పారెడ్డి మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. తమ నాయకుడికి పార్టీ అధిష్ఠానం న్యాయం చేయాలని నినదించారు. పట్టణంలోని గాంధీ వృత్తం వద్ద టైర్లు తగలబెట్టారు. దీంతో వాహనాల రాకపోకలకు పాక్షికంగా అంతరాయం కలిగింది.
మరికొందరు సీనియర్లు..
తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు మరో సీనియర్ ఎమ్మెల్యే ఎస్.అంగార అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాజీవితంలో తాను ఎప్పుడూ విలువలకు కట్టుబడి ఉన్నానని, ఇప్పుడు ఆ విలువలకే గుర్తింపు లేకుండా పోయిందని ఆక్రోశించారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమేష్ కత్తి, కేంద్ర మాజీ మంత్రి బసవరాజ్ పాటిల్ యత్నాళ్ తదితర సీనియర్ నేతలు మంత్రుల ప్రమాణ ఉత్సవానికి దూరంగా ఉండిపోయారు. ఈ ప్రభావం భవిష్యత్తులో పార్టీపై పడే అవకాశాలున్నాయని అనుయాయులు చెప్పారు. మంత్రివర్గంలో తీర ప్రాంతం, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించలేదని కొందరు నేతలు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos