అనర్హులకు భాజపా తీర్థం

అనర్హులకు భాజపా తీర్థం

బెంగళూరు : కర్ణాటకలో అనర్హత ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయ్యొచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన కాసేపటికే వారంతా కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. గురువారం పార్టీ సీనియర్ నేతల సమక్షంలో వారంతా భాజపాలో చేరనున్నట్లు ఉపముఖ్యమంత్రి సీఎన్ అశ్వత్థ నారాయణ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కొందరు అనర్హత ఎమ్మెల్యేలు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎల్.సంతోష్‌ను కలిశారు. భాజపాలో చేరేందుకు వారు ఆసక్తి చూపించారని, ఈ విషయమై సీనియర్ నేతలను కలిసినట్లు అశ్వత్థ నారాయణ తెలిపారు. ఇందుకు అధిష్ఠానం కూడా అంగీకరించడంతో గురువారం ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సమక్షంలో అనర్హత ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతారని చెప్పారు. అయితే ఉప ఎన్నికల్లో అనర్హత ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తారా లేదా అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నారు. ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అనర్హత ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చే అంశంపై పార్టీ అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. కర్ణాటకలో ఇటీవల రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల రాజీనామాలతో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలగా, భాజపా అధికారంలోకి వచ్చింది. రాజీనామా చేసిన 17 మంది ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ కేఆర్ రమేశ్‌ కుమార్ అనర్హత వేటు వేశారు. దీనిపై వారు సుప్రీంకోర్టుకు వెళ్లగా, న్యాయస్థానం కూడా స్పీకర్ నిర్ణయాన్నే సమర్థించింది. అయితే ఆ ఎమ్మెల్యేలు ప్రస్తుత శాసన సభ ముగిసేంతవరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా స్పీకర్ ఇచ్చిన ఆదేశాలను మాత్రం కొట్టివేసింది. ఎన్నికల్లో వారు పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. డిసెంబరు 5న రాష్ట్రంలో 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల వివాదం కారణంగా నగరంలోని రాజరాజేశ్వరి నగర, రాయచూరు జిల్లా మస్కి నియోజకవర్గాలకు ఇప్పుడు ఉప ఎన్నికలు జరగడం లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos