కేసీ రెడ్డి కంచు విగ్రహ స్థాపనకు ఉప ముఖ్యమంత్రి సూచన

కేసీ రెడ్డి కంచు విగ్రహ స్థాపనకు ఉప ముఖ్యమంత్రి సూచన

బెంగళూరు : కర్ణాటక (మైసూరు స్టేట్‌) తొలి ముఖ్యమంత్రి క్యాసంబళ్లి చంగలరాయరెడ్డి (కేసీ రెడ్డి) కంచు విగ్రహ స్థాపనకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి గోవింద కారజోళ అధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న ఫైబర్‌ విగ్రహాన్ని తొలగించి, శాశ్వత విగ్రహాన్ని నెలకొల్పాలని ఆయన సూచించారు. విధాన సౌధలో సోమవారం జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించిన కారజోళ, తొలుత మాదిరి విగ్రహాలను తెప్పించుకుని, సూక్ష్మంగా పరిశీలించిన అనంతరం తుది విగ్రహ నమూనాను ఖరారు చేయాలని సలహా ఇచ్చారు. ఈ రంగంలో పరిణితి సాధించిన వారి సహకారంతో విగ్రహ రూపకల్పన చేయాలన్నారు. కర్ణాటకకు కేసీ రెడ్డి అందించిన సేవలు అపారమని, కనుక ఆయన శాశ్వత విగ్రహ స్థాపనకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. దీనిపై అనుసరించాల్సిన విధి విధానాలతో కూడిన నివేదికను తదుపరి సమావేశంలో ప్రవేశపెట్టాలని ఆయన ప్రజా పనుల శాఖ సీనియర్‌ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, బీటీఎం లేఔట్‌ శాసన సభ్యుడు రామలింగారెడ్డి, కేసీ రెడ్డి తనయుని కోడలు వసంత కవితా రెడ్డి, శాసన సభ కార్యదర్శి విశాలాక్షి, శాసన మండలి కార్యదర్శి మహాలక్ష్మి, ప్రజా పనుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజనీశ్‌ గోయల్‌, కార్యదర్శి బీ. గురుప్రసాద్‌, ఉప ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి వీ. శ్రీనివాస్‌, వివిధ శాఖల సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos