పాత యాక్టివాతో ఎర…రూ.97 వేలు హాంఫట్

  • In Crime
  • September 16, 2019
  • 206 Views
పాత యాక్టివాతో ఎర…రూ.97 వేలు హాంఫట్

ముంబై : సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు విజృంభిస్తున్నారు. అమాయకులను తెలివిగా బురిడీ కొట్టించడానికి తమ హస్త లాఘవాన్ని ప్రదర్శించడంలో రాటుదేలుతున్నారు. తాజాగా పాత యాక్టివా స్కూటర్ కోసం ఓ అమాయకుడు రూ.97 వేలు పోగొట్టుకున్నాడు. ముంబైలోని ఖార్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల మూడో తేదీన ఆన్‌లైన్‌లో ఓ ప్రకటన చూశాడు. సెకండ్ హ్యాండ్ స్కూటర్‌ను రూ.25 వేలకు అమ్మబడును అనేది ప్రకటన సారాంశం. అందులోని మొబైల్ నంబరుకు ఫోను చేసి యాక్టివాను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు ఆసక్తిని కనబరించాడు. ప్రకటన ఇచ్చిన సైబర్ నేరగాడు ముందుగా కొంత డబ్బును అడ్వాన్స్ రూపంలో ఆన్‌లైన్‌ ఖాతాకు పంపాలని సూచించాడు. దీంతో రూ.15 వేలు పంపేశాడు. ఈ నెల 4న మరో వ్యక్తి ఫోను చేసి స్కూటర్ రవాణా ఛార్జీల కింద రూ.5 వేలు ఇవ్వాలనడంతో ఆ మొత్తాన్నీ ఆన్‌లైన్‌లో పంపాడు. అతను మళ్లీ కొంత డబ్బు డిమాండ్‌ చేయడంతో రూ.7 వేలు పంపాడు. ప్రకటన ఇచ్చిన తొలి మోసగాడు తానే అసలు విక్రేతనని నమ్మిస్తూ, ఆ వ్యక్తి నుంచి తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని రెండో మోసగాని డిమాండ్ చేశాడు. ఇదంతా పథకం ప్రకారమే జరిగింది. రెండో మోసగాడు డబ్బులు వెనక్కు ఇచ్చేయడానికి సిద్ధమేనంటూ అతని ఈ-వ్యాలెట్‌కు రెండు లింక్స్ పంపాడు. ఆన్‌లైన్‌ లింక్స్ ఉపయోగించడాన్ని తెలియని ఆ వ్యక్తి, తన డబ్బులు తిరిగి వస్తాయనుకుని వాటిని క్లిక్ చేశాడు. అంతే…అతని ఖాతాలోని మరో రూ.70 వేలు మాయమయ్యాయి. దీంతో మొత్తం అతను రూ.97 వేలు పోగొట్టుకున్నట్లయింది. నేరగాళ్లకు ఫోన్ చేస్తే మొబైల్స్ స్విచాఫ్ అని సమాధానం వచ్చింది. చేసేది లేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos