సామ్రాజ్యవాద, కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం

సామ్రాజ్యవాద, కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం

న్యూ ఢిల్లీ :ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద, కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలను ఉధృతం చేయాలని ఏఐకేఎస్, ఎఐఏడబ్ల్యూయూ జాతీయ ప్రధాన కార్యదర్శులు విజూ కృష్ణన్, బి. వెంకట్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 10న సెనెగల్ రాజధాని సాలెదాకర్లో ప్రారంభమైన అంతర్జాతీయ వ్యవసాయాధారిత శ్రామిక యూనియన్ ఐదో మహాసభలకు 85 దేశాల నుండి 125 సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ నుండి రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ప్రతినిధుల బృందం పాల్గొంది. ఈ మహాసభలో సామ్రాజ్యవాద దోపిడీ, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులు చేజిక్కించుకోవడం, సామ్రాజ్యవాదులు తమ లాభాపేక్ష కోసం పర్యావరణాన్ని దెబ్బతీయడం, ప్రకృతి వనరులైన సహజ సంపదను దోచుకోవడం, వ్యవసాయ రంగం నుండి రైతాంగాన్ని వెళ్లగొట్టడం, కార్పొరేట్ శక్తులు వ్యవసాయ భూముల్ని చేజిక్కించుకోవడం, ప్రాథమిక హక్కుల్ని కాలరాయడం, ఎగుమతి ఆధారిత పంటలను ప్రోత్సహిస్తూ ఆహార ధాన్యాల ఉత్పత్తులను దెబ్బతీయడం వల్ల ఎదురవుతున్న ఆహార భద్రత, ఫలితంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వీటిపై ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న పోరాటాలు, వాటిని పక్కదోవ పట్టించేందుకు మితవాద శక్తుల ప్రయత్నాలు, పాలిస్తీనాపై ఇజ్రాయిల్, అమెరికాలు సాగిస్తున్న యుద్ధం, క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటూ నిలిచి ముందుకుసాగడం వంటి అంశాలపై చర్చించారు. అనంతరం ఇండియా నుండి ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడారు. ప్రపంచంలో లాగే తమ దేశంలో కూడా పాలక వర్గాల దన్నుతో కార్పొరేట్లు వ్యవసాయ రంగాన్ని తన గుప్పెట్లోకి లాక్కుంటున్నారని తెలిపారు. ఫలితంగా దేశంలో పేద ప్రజానీకానికి ఆహార భద్రత కొరవడుతోందని అన్నారు. శ్రమించి పండించిన రైతాంగానికి గిట్టుబాటు ధర హామీ లేదన్నారు. దోపిడీ వ్యతిరేక శక్తులపై పోరాటాలు దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఇందుకు సంవత్సరంపైగా సాగిన చారిత్రాత్మక రైతు పోరాటం తార్కాణమన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న పోరాటాలకు భారతీయులు అండగా నిలుస్తున్నారని, రాబోయే కాలంలో ఆ సంఘీభావ పోరాటాన్ని విస్తృతం చేస్తామని తెలిపారు. అంతకుముందు యూనియన్ అంతర్జాతీయ కార్యదర్శి జనరల్ జూలియన్ హక్ నివేదికను ప్రవేశ పెట్టారు. ఎఫ్ఎస్ఎమ్, డబ్ల్యూఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి పంపిస్ క్రీట్సిస్ తమ సందేశాన్ని అందించారు.
ఈ మహాసభకు టీయూఐ అధ్యక్షులు అలీయూ ఎన్డీఏ (సెనగల్), విజూ కృష్ణన్(ఇండియా), మొహ్మద్ యలియా(పాలిస్తీనా) సహిద్ అబూబకర్(ఈజిప్ట్), డు టీన్ డంగ్ (వియత్నాం) అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఈ మహాసభలో అఖిల భారత కిసాన్ సభ (అజరు భవన్) నేత రావుల వెంకయ్య, బీకేఎంయూ నేతలు విజయేంద్ర సింగ్ నిర్మల్, గుల్జార్ సింగ్ గోరియ ఎఐఏడబ్య్లూయూ నేత విక్రమ్ సింగ్ తదితరులతో కూడిన భారత బృందం పాల్గొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos