‘ఇండియా’ కూటమికి ఓటు వేయండి

‘ఇండియా’ కూటమికి ఓటు వేయండి

అగర్తల: రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని సర్కారును కూకటివేళ్లతో పెకిలించి, ప్రతిపక్ష ‘ఇండియా’ బ్లాక్కు ఓటు వేసి ప్రజాస్వామ్య, లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ప్రజలను కోరారు. అగర్తలలో కాంగ్రెస్ అధ్యక్షుడు, పశ్చిమ త్రిపుర లోక్సభ నియోజకవర్గానికి ‘ఇండియా’ కూటమి తరఫు అభ్యర్థి ఆశిష్ కుమార్ సాహా, అసెంబ్లీ ఉప ఎన్నికల అభ్యర్థి రతన్ దాస్లకు అనుకూలంగా జరిగిన ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మాణిక్ సర్కార్ తన ప్రసంగంలో అధికార బీజేపీపై విమర్శల వేడిని పెంచారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం, పేలవమైన వేతనాలు, విద్య, ఆరోగ్యం ప్రయివేటీకరణ వంటివి దేశంలో ప్రబలంగా ఉన్నాయనీ, అందుకే ప్రస్తుత ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపాల్సి నవసరం ఉన్నదని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలకు మద్దతుగా ముందుకు రావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ”ప్రజలు ఉద్యోగాలు కోల్పోతు న్నారు. కంపెనీలు మూతపడుతున్నాయి. శ్రామిక వర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు లోక్సభ ఎన్నికల పోరు, మరోవైపు ఉనికి కోసం పోరాటం. సమావేశాలకు హాజరవటం, రాజకీయ ప్రసంగాలు వినటమే కాకుండా కుటుంబ సభ్యులను సంఘటితం చేయాలి” అని మాణిక్ సర్కార్ ప్రజలను కోరారు. ”2023 (అసెంబ్లీ ఎన్నికలు)లో ఏమి జరిగిందో మీరు చూశారా? మీకు పునరావృతం (హింస) కావాలా? మీరు దీన్ని కచ్చితంగా కోరుకోరు. బయటకు వచ్చి మీ ఓటు వేయాలి. మేము మీతో ఉన్నాము. అడ్డుకుంటే రోడ్డుపై కూర్చొని నిరసన తెలపండి. మీరు మీ ఓటు వేయగలిగితే తప్ప, ఇతరులను ఓటు వేయడానికి అనుమతించవద్దు”అని ఆయన అన్నారు.
దక్షిణ జిల్లాలోని బైఖోరాలో జరిగిన ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో సీపీఐ(ఎం) త్రిపుర కార్యదర్శి జితేంద్ర చౌదరి మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించడమేనని అన్నారు. బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ పాలనలో 140 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రమాదంలో ఉన్నారనీ, అందుకే ఆ పార్టీని అధికారం నుంచి తరిమికొట్టటానికి 27 రాజకీయ పార్టీలు తమ సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టి ‘ఇండియా’ బ్లాక్ను ఏర్పాటు చేశాయని ఆయన అన్నారు.త్రిపురలోని రెండు పార్లమెంట్ స్థానాలైన పశ్చిమ త్రిపుర, తూర్పు త్రిపురలలో రెండు దశల్లో పోలింగ్ జరగనున్నది. ఈనెల 19న మొదటి దశలో, 26న రెండో దశలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos