అవినితికి పాల్పడితే అంతే సంగతులు

అవినితికి పాల్పడితే అంతే సంగతులు

అమరావతి: అవినితికి పాల్పడిన శాసనసభ్యులతో బాటు ఇతరులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఇక్కడ ఆరంభమైన రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ఎంతటి పెద్ద వాడైనా, ఏ స్థాయిలో ఉన్నా కూడా అక్రమాలకు, అవినీతికి, దోచు కోవడాన్ని ప్రోత్సహించ బోమన్నా’రు. ప్రజీ తీర్పును ఎన్నడూ విస్మరించరాదని హితవు పలికారు. ఫలానా వ్యక్తే శాసన సభ్యుడు కావాలని ప్రజలు ఓట్లేసి గెలిపించారని గుర్తు చేసారు. శాసనసభ్యులతో పాటు అధికార్లు కూడా ప్రజల సమస్యలకు సానుకూలంగా స్పందించాలని, తమ సమస్యల్ని వినిపించేందుకు వచ్చినపుడు చిరునవ్వుతో స్వాగతం పలకాలని జగన్ సూచించారు. ’శాససభ్యుల విశ్వాసాన్ని కూడా పొందాలి. ప్రజల సమస్యలను శాసనసభ్యులే అధికారుల దృష్టికి తీసుకొస్తారు. వాటిని పరిష్కరించాలని’ విన్నవించారు. ప్రభుత్వం, అధికా రులు కలిసి కట్టుగా పనిచేయాలంటూ ఉందన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల కష్ట నష్టాల్ని అధికారులు ఏనాడూ మర్చి పోకూడదని సూచించారు.అణగారిన వర్గాలు ఆర్థికంగా బలపడేందుకు అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేయాలని కోరారు.కులం, మతం, ప్రాంతం, పార్టీ లకు అతీతంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదార్లుగా అర్హులైన వారినే ఎంపిక చేయాలని ఆదేశించారు. ‘మనం పాలకులం కాదు. ప్రజలకు సేవకులం అనే విషయాన్ని గుర్తుంచుకొని పాలనను సాగించాల’ని హితవు పలికారు. నవరత్నాల బ్రోచర్ ప్రతి మంత్రి, ఉన్నతాధికార్లతో బాటు ప్రతి ఒక్కరి వద్ద ఉండాలన్నారు. దాన్ని భగవద్గీత , ఖురాన్, బైబిల్ గా భావించి పని చేయాలని సూచించారు. ‘ఎన్నికల్లో ప్రభుత్వ పని తీరు పైనే ప్రజలు ఓటు వేస్తారు. ప్రజలకు మంచి పనులు చేస్తేనే మన ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని’ పేర్కొన్నారు. ‘ఎన్నికల వరకే రాజకీయాలు. ఎన్నికల తర్వాత అభివృద్ది గురించే చర్చ జరగాల్సి ఉందని’ తేల్చి చెప్పారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి నేరుగా చేరేందుకు వీలుగా గ్రామ వలంటీర్లను నియమిస్తున్నట్టుగా తెలిపారు. ప్రతి రెండు వేల కుటుంబాలు ఉన్న గ్రామాల్లో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు.గ్రామ వలంటీర్లు రాగద్వేషాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు చేర్చాలన్నారు. ఒకవేళ వలంటీర్లు అవినీతికి పాల్పడితే వెంటనే అతడి స్థానంలో మరోకరిని నియమిస్తామన్నారు. గ్రామస్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు పాలనలో పారదర్శకత ఉండాలన్నారు. అధికారులు, కార్యాల యాల చుట్టూ తిరిగితేనే పనులు అయ్యే పరిస్థితిలో మార్పులు రావాల్సి ఉందన్నారు. లంచాలు ఇస్తేనే పనులు జరిగే వాతావరణానికి చరమ తీతం పలాకాలని సూచించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos