హోసూరు ప్రాంతంలో ప్రబలిన కరోనా

హోసూరు ప్రాంతంలో ప్రబలిన కరోనా

హోసూరు : కరోనా వైరస్ పల్లెలకు ప్రబలడంతో గ్రామీణులు భయాందోళనకు గురవుతున్నారు. కృష్ణగిరి జిల్లాలో రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నది. జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య వందకు పైగా చేరగా, హోసూరులో 60 మందికి పైగా ఆ మహమ్మారి బారిన పడ్డారు. పట్టణాలకే పరిమితమనుకున్న కరోనా గ్రామీణ ప్రాంతాలకూ ప్రబలడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హోసూరు తళి రోడ్డులోని పెద్ద బేలగొండపల్లిలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకగా అతన్ని ఆస్పత్రికి తరలించారు. హోసూరు సమీపంలోని బాగలూరులో కూడా ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందనే సమాచారం గుప్పుమనడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అదేవిధంగా డెంకణీకోట ఆటవీ గ్రామాలలో కూడా కొంతమందిని క్వారంటైన్‌కు తరలించినట్లు సమాచారం. హోసూరు ప్రాంతంలో కరోనా వైరస్ వేగంగా ప్రబలుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్లాలని ఆరోగ్య శాఖ, జిల్లా యంత్రాంగం హెచ్చరించినా ఎవరూ పట్టించుకోవడం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావడం తగ్గిస్తే కరోనా వైరస్‌ను కట్టడి చేయవచ్చని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అధికారుల హెచ్చరికలను ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు పాటించి కరోనాను కట్టడి చేసే బాధ్యత అందరిపై ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos