స్వేచ్ఛ క్షీణ దశకు సంకేతం

స్వేచ్ఛ క్షీణ దశకు సంకేతం

న్యూఢిల్లీ : ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్ను సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారించటం స్వేచ్ఛ గొంతు నొక్కడమేనని మానవ హక్కుల సంఘం వ్యాఖ్యానించింది. భావ వ్యక్తీకరణ మీద దాడిగా అభివర్ణించింది. కామన్వెల్త్ హ్యుమన్ రైట్స్ ఇన్షియేటివ్ ఆఫ్ ఇండియా (సిహెచ్ఆర్ఐ) ప్రశాంత్ భూషణ్కు మద్దతుగా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ప్రజల హక్కులను కాపాడటం ద్వారా వారికి న్యాయవ్యవస్థపై నమ్మకం ఏర్పడుతుందే తప్ప హక్కుల కోసం పోరాడుతున్నవారికి వ్యతిరేకంగా చట్టాన్ని ఉపయోగించినందుకు కాదు. మహమ్మారి సమయంలో మిగతా ముఖ్యమైన విచారణలన్నింటినీ పక్కనబెట్టి.. మానవహక్కుల కోసం పోరాడే భూషణ్ వంటివారిపై ధిక్కార తీర్పులు ఇవ్వడం భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు వ్యతిరేకమే..’ అని తెలిపింది. సిహెచ్ఆర్ఐ కార్యనిర్వాహక మండలిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్. బి. లోకూర్, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎ.పి. షా కూడా సభ్యులు. ముంబయికి చెందిన ప్రముఖ న్యాయవాది నవ్రోజ్ హెచ్. సిర్వాయి కూడా స్పందించారు. ‘అత్యున్నత న్యాయస్థానం తీర్పు స్వేచ్ఛగా భావాలు వ్యక్తీకరించే వారికి వ్యతిరేకంగా ఉంది. న్యాయస్థానం గౌరవం, ప్రతిష్టల పేరిట భావ వ్యక్తీకరణపై దాడి . తీర్పు న్యాయవాదులపై ఉద్దేశపూర్వక దాడిగా ఉంద’ని విమర్శించారు. సుప్రీంకోర్టు న్యాయ వాదులు దుష్యంత్ దవె, కరుణ నంది, శ్యాం దివాన్, మేనక గురు స్వామి, విరిందా గ్రోవర్, సంజరు హెగ్డే తదితరులు స్వతంత్య్ర న్యాయవ్యవస్థకు విరుద్ధంగా తీర్పు ఉన్నదని ఆరోపించారు. ఈ తీర్పు న్యాయవాదులు స్వేచ్ఛగా మాట్లాడటానికి వీలు లేకుండా చేసిందన్నారు. ఇదే విషయమై సరైన విచారణ జరిపించాలని దాదాపు 450 మంది న్యాయవాదులు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సిబిఎ)కు లేఖ రాశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos