చిదంబరానికి సీబీఐ కస్టడీ

ఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో అరెస్టైన కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఢిల్లీ సీబీఐ కోర్టు ఈ నెల 26వరకూ కస్టడీ విధించింది. కుటుంబ సభ్యులూ, లాయర్లు కలవొచ్చని కోర్టు తెలిపింది. ప్రతిరోజూ అరగంట పాటు కుటుంబసభ్యులతో మాట్లాడే అవకాశం కూడా కల్పించింది. చిదంబరం తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో 2017 మే 15న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2007లో ఈ మీడియా గ్రూపునకు  రూ.305 కోట్ల మేరకు విదేశీ నిధులు వచ్చాయని, ఇందుకు అనుమతులు పి చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో లభించాయని పేర్కొంది. ఈ లావాదేవీల్లో మనీలాండరింగ్ జరిగినట్లు గుర్తించడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ 2018లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో పి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరంపై కూడా ఆరోపణలు నమోదయ్యాయి. కార్తిని చెన్నైలో సీబీఐ గతంలో అరెస్టు చేసి, ఢిల్లీ తీసుకెళ్ళింది. ఆయన ఒక రోజు పోలీసు కస్టడీలో ఉన్నారు. అనంతరం కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా వ్యవస్థాపకురాలు ఇంద్రాణి ముఖర్జియా ఈ కేసులో అప్రూవర్‌గా మారారు. జులై 4న ఆమెకు కోర్టు ఈ కేసులో క్షమాభిక్ష ప్రసాదించింది. తాను అన్ని యథార్థాలను చెబుతానని ఆమె కోర్టుకు తెలిపారు. తప్పుడు సాక్ష్యం చెబితే, ఆరోపిత నేరంపై విచారణ జరుపుతామని కోర్టు ఆమెకు షరతు విధించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos