కేంద్రంలో కొత్త ప్రభుత్వం : కేరళ సీఎం

తిరువనంతపురం
: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కేంద్రంలో సమాఖ్య, లౌకిక విధానాలతో కూడిన
ప్రభుత్వం ఏర్పడుతుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ జోస్యం చెప్పారు. తెలంగాణ
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం విజయన్‌ను కలుసుకుని చర్చించిన సంగతి తెలిసిందే. ఆ వివరాలు
వెల్లడించడానికి మంగళవారం విజయన్‌ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తమ మధ్య కీలక
చర్చ జరిగిందని, దేశ రాజకీయ పరిస్థితులపై కేసీఆర్‌ మాట్లాడారని తెలిపారు. ఎన్డీఏ, యూపీఏలు
ఈసారి మెజారిటీలు సాధించలేవని, ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థాయిలో
ఉంటాయని వివరించారు. ప్రధాని అభ్యర్థి గురించి తమ సమావేశంలో చర్చించలేదని ఆయన చెప్పారు.
కాగా ఈ నెల 13న చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే. స్టాలిన్‌తో కూడా కేసీఆర్‌ సమావేశమవుతారని
వార్తలు వచ్చాయి. అయితే ఈ నెల 19న నాలుగు శాసన సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నందున,
స్టాలిన్‌ ప్రచారంలో తలమునకలుగా ఉన్నారు. కనుక 13న సమావేశం జరిగే అవకాశాల్లేవని డీఎంకే
వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్‌ కలసి పోటీ చేసిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos