సీబీసీ బిజెపి భజన..

సీబీసీ బిజెపి భజన..

ముంబయి : ప్రభుత్వ పథకాలు, ప్రణాళికలను గురించి ప్రచారం చేసేందుకు ఉద్దేశించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) తన విధులను గాలికి వదిలేసి పాలక బీజేపీ సేవలో తరిస్తోంది. ఎన్నికలకు ముందు ఆ పార్టీ కోసం గూగుల్ యాడ్స్లో పెద్ద ఎత్తున నిధులు వెచ్చించింది. గత నవంబరులోనే దేశంలో సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంది. అదనుగా భావించిన బీజేపీ భారీ స్థాయిలో రాజకీయ ప్రకటనలు గుప్పించడం ప్రారంభించింది. ఇందుకోసం సీబీసీ సేవలను ఉపయోగించుకుంది. ‘మోడీ కీ గ్యారంటీ’ అనేది మోడీ వ్యక్తిగత హామీ. కానీ దానికి సీబీసీ ప్రచారం కల్పించింది. మోడీ కీ గ్యారంటీ అనే ట్యాగ్లైన్తో నవంబర్ మూడో వారం నుంచే గూగుల్లో బీజేపీ ప్రచారం ప్రారంభించింది. అదే సమయంలో మరో సంస్థ దాదాపు అదే తరహా ప్రచారం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం మొదలు పెట్టింది. దానికి ‘మోడీ సర్కార్ కీ గ్యారంటీ’ అని పేరు పెట్టింది. అయితే కొన్ని నెలల పాటు కొనసాగిన ఆ వీడియో ప్రకటనలో మోడీ గ్యారంటీ అనే చెప్పుకున్నారు. ఆ ప్రచారానికి వెచ్చించిన సొమ్మంతా పన్ను చెల్లింపుదారులదే. సీబీఐ ప్రకటనలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నా యని, ఆ సంస్థ పాలక పక్షం ప్రచారం కోసం ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ మార్చి 22న ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. సుమారు నాలుగు నెలల వ్యవధిలోనే గూగుల్ ప్రకటనల కోసం సీబీసీ రూ.38.7 కోట్లు ఖర్చు చేసిందని అల్ జజీరా తేల్చింది. నవంబరులో ఆన్లైన్ వేదికపై ప్రకటనలు ఇవ్వడం మొదలుపెట్టిన ఆ సంస్థ మార్చి 15 వరకూ దానిని కొనసాగించింది. అదే రోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో ఈ ప్రచారానికి బ్రేక్ పడింది. ఆ కాలంలో గూగుల్లో ప్రకటనల కోసం అధిక మొత్తం వెచ్చించిన సంస్థగా సీబీసీ రికార్డు సృష్టించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos