బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్నం : ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రకు ఆనుకుని నైరుతి, పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. దీనిపై సముద్ర మట్టానికి 7.6. కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం ఈశాన్య దిశగా పయనించి శుక్రవారంనాటికి వాయుగుండంగా బలపడి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఆ తర్వాత ఈశాన్య, వాయువ్య బంగాళా ఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ క్రమంలో తుఫాన్గా మారి ఈ నెల 25వ తేదీ రాత్రి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటుతుందని కొన్ని మోడళ్లు, బంగ్లాదేశ్, మయన్మార్ దిశగా వెళుతుందని మరికొన్ని మోడళ్ల ఆధారంగా అంచనా వేశారు. ఈనెల 24వ తేదీ తరువాత ఏర్పడనున్న తుఫాన్కు ఒమన్ దేశం సూచించిన ‘రీమల్’ (ఆర్ఈఎంఏఎల్) అని పేరు పెట్టనున్నారు. కాగా, గడచిన మూడు రోజులుగా వాయువ్య భారతంలో తీవ్ర వడగాడ్పులు కొనసాగు తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగుతాయి. ఈనెల 26వ తేదీ నుంచి వడగాడ్పులు వీస్తాయని ఇస్రో వాతావరణ నిపుణుడు హెచ్చరించారు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు బుధవారం అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరిన్, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న రెండు రోజుల్లో అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలో మిగిలిన ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించనున్నాయని ఐఎండీ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కేరళ పరిసరాల్లో విస్తారంగా, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా కర్ణాటక, తమిళనాడు, లక్షద్వీ్పలో కూడా వర్షాలు పడుతున్నాయి. రానున్న రెండు, మూడు రోజుల వరకు వర్షాలు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఉన్న మోడళ్ల మేరకు ఈనెల 31న కేరళలో(నాలుగు రోజులు అటు ఇటుగా) నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని బుధవారం వాతావరణ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే కొందరు నిపుణులు ఒకరోజు ముందు (30న) రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos