కర్ణాటక సీఎంకు పదవీ గండం

కర్ణాటక సీఎంకు పదవీ గండం

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైని మార్చవచ్చని కమలం పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం బెంగళూరుకు రానున్నారు. ఆయన ఇక్కడికి వచ్చాక స్థానిక నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. సీఎం బసవరాజు బొమ్మై నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తే పార్టీకి నష్టమనే కోణంలో పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్, జేడీఎస్ కూటమిలోని ప్రభుత్వాన్ని కూల్చిన అనంతరం బీజేపీ ప్రభుత్వం ఏర్పడి, యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. రెండేళ్ల అనంతరం బసవరాజు బొమ్మైని ముఖ్యమంత్రిగా అధిష్టానం నిర్ణయించింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కొద్ది రోజులకే పదవిని కోల్పోతున్నారంటూ ప్రచారం జరిగింది. అప్పట్లోనే ఈ విషయమై బొమ్మై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం మార్పు గురించి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ ఏదీ శాశ్వతం కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని ఇచ్చాయి. కానీ, అలాంటిదేమీ జరగలేదు.
మళ్లీ ఆరు నెలల తర్వాత ఇలాంటి చర్చ మళ్లీ మొదలైంది. కాంగ్రెస్‌లో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ స్థాయిలో ప్రజల్లో బొమ్మై ఆదరణ పొందలేకపోతున్నారనే విమర్శ ఉంది. ఇది బీజేపీ అధిష్టానాన్ని కలవరపరుస్తోందని అంటున్నారు. అలాగే పార్టీలో అంతర్గత కుమ్ములాటలను చక్కదిద్దడంలో బొమ్మై విఫలమయ్యారని అంటున్నారు. దీనికి తోడు ప్రజా పనుల శాఖ మంత్రి కేఎస్‌. ఈశ్వరప్పపై కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆరోపణలు చేయడం, తదనంతరం సంతోష్‌ ఆత్మహత్యకు పాల్పడడం లాంటి పరిణామాలు ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారాయి. ఈ వివాదంలో ప్రభుత్వం అప్రతిష్టపాలు కాకుండా నివారించడంలో బొమ్మై విఫలమయ్యారని పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇవన్నీ బొమ్మై పీఠానికి ఎసరు తెచ్చాయని అంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos