బీజేపీ మ్యానిఫెస్టోలో కనిపించని స్పష్టత

బీజేపీ మ్యానిఫెస్టోలో కనిపించని స్పష్టత

హైదరాబాద్: బీజేపీ ప్రకటించిన మ్యానిఫెస్టోలో స్పష్టత కొరవడింది. ఎప్పటిలాగానే ప్రజల్ని విభజించు పాలించు అనే రీతిలో భావోద్వేగపరమైన అంశాల చుట్టూ తిరిగింది.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అమలు చేయని హామీలను ఇక్కడ ఎలా అమలు చేస్తారనే చర్చా నడుస్తున్నది. రైతాంగ ఉద్యమంలో 700 మంది రైతులు ప్రాణ త్యాగాలు చేసిన తర్వాత నల్లచట్టాలను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నా మద్దతు ధర హామీ చట్టంపై నేటికీ స్పష్టత ఇవ్వలేదు. కానీ వరికి మద్దతు ధర రూ.3,100 ఇస్తామని మ్యానిఫెస్టోలో చెప్పుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వమే ఎమ్ఎస్పీని నిర్ణయిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం బోనస్ మాత్రమే ఇస్తుంది. గత ప్రభుత్వాల మాదిరిగానే ఎస్సీ వర్గీకరణను ‘కమిటీ’కే పరిమితం చేసి..దాన్ని మరికొంత కాలం నానబెట్టే ప్రయత్నం చేసింది. రైతాంగ సాయుధ పోరాట చరిత్రకు రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ పేరుతో మతం రంగు పులిమే ప్రయత్నం చేసింది. ఒక మహత్తర ప్రజా పోరాటాన్ని హిందూ, ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నాల్లో భాగమే ఇది ఉజ్వల లబ్దిదారులకు ఏడాదికి నాలుగు సిలిండర్లు ఇస్తామని చెప్పిందేగానీ..పేదలందరికీ ఇస్తామని ప్రకటించలేదు. కృష్ణా జలాల వాటా విషయంలో ట్రిబ్యునల్ వద్ద బలమైన వాదనలు వినిపిస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొందే తప్ప సమస్యను పరిష్కరిస్తామని చెప్పలేదు. అంతర్జాతీయంగా చమురు ధరలు తక్కువ ఉన్నప్పటికీ రోజురోజుకీ ధరలు పెరగడానికి కేంద్రమే కారణం. ఇప్పుడు డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టే. ముస్లిముల్లోని వెనుకబడిన తరగతుల వారి రిజర్వేషన్లు ఎత్తివేత, వృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీయాత్ర, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ, ముస్లిం మధ్య జరిగినదిగా చూపెట్టేలా పొందుపర్చిన అంశాలు మత రాజకీయాల్ని బలపరిచేలా ఉన్నాయి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మతరిజర్వేషన్లు తెలంగాణలో అమలవుతున్నాయి..దాన్ని తీసేస్తాం అని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యతిరేకమే అయితే, పదేండ్లుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దాన్ని ఎందుకు రద్దు చేయలేదనే చర్చ మొదలైంది. పారదర్శకమైన పాలన అందిస్తామంటున్న కేంద్రం తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలకే పరిమితం కావడం తప్ప చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే విమర్శ బలంగా వినిపిస్తున్నది. అట్టహాసంగా ప్రకటించిన మ్యానిఫెస్టోలో ఎక్కడా స్పష్టత లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos