బీడీ కార్మికుల బతుకుల్లో చీకటి నింపిన కేంద్రం

బీడీ కార్మికుల బతుకుల్లో చీకటి నింపిన కేంద్రం

ముషీరాబాద్: కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికుల బతుకుల్లో చీకటి నింపిందని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత అన్నారు. ఆలిండియా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) జాతీయ వర్క్షాప్ కె.పద్మనాభం అధ్యక్షతన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ.. బీడీ కార్మికులను మరింత చైతన్యపరిచి పోరాటాలు చేయాలన్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో సంఘాన్ని విస్తరించామన్నారు. బీడీ ఉత్పత్తిలో దేశవ్యాప్తంగా మెజార్టీగా ఉన్న మహిళా ప్రాతినిధ్యాన్ని సంఘంలో పెంచాలని, వారి సమస్యలపై పోరాటాలు చెయ్యాలని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మొత్తంగా బీడీ పరిశ్రమను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ భారం వల్ల ఇప్పటికే చాలా పరిశ్రమలు మూతపడ్డాయని, ఇలాంటి విధానాలను తమ ఫెడరేషన్ వ్యతిరేకిస్తూ పోరాటాలకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం తమపై అణచివేత చర్యలకు పూనుకుంటోందని చెప్పారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో బీడీ వర్కర్స్ ఫెడరేషన్ పాల్గొని.. ఆ విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బీడీ పరిశ్రమలపై జీఎస్టీలాంటి విధానాలకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 80 లక్షల మంది కార్మికుల నోట్లో మట్టికొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను అమలు చేస్తున్నదన్నారు. బీడీ కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన నిధులను కొల్లగొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీడీ కార్మికుల సంక్షేమానికి కేటాయించిన సెస్సును ఎత్తేసిందని, పెన్షన్ పెంచాలని పెన్షన్ ట్రస్ట్బోర్డు సిఫారస్ చేసినా 10 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం చేస్తోందన్నారు. బీడీ పరిశ్రమను కాపాడుకుందామని.. ప్రధాని మోడీ విధానాలను ప్రతిఘటిద్దామని పిలుపునిచ్చారు. అంతకు ముందు జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గోపాలస్వామి, ప్రధాన కార్యదర్శి ఎస్.రమ, నూర్జహాన్, ఓబుల్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos