ఛాంపియన్ ఇంటి దారి

ఛాంపియన్ ఇంటి దారి

మెల్బోర్న్…ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో సంచలనం. డిఫెండింగ్‌  ఛాంపియన్‌ కరోలినా వోజ్నియాకి (డెన్మార్క్‌) మూడో రౌండ్లోనే వెనుదిరిగింది. శుక్రవారం మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్‌ వోజ్నియాకి 4-6, 6-4, 3-6తో రష్యా భామ షరపోవా చేతిలో పరాజయం చవిచూసింది. రెండో సీడ్‌ కెర్బర్‌ అలవోకగా ముందంజ వేసింది. మూడో రౌండ్లో కెర్బర్‌ 6-1, 6-0తో బిరెల్‌ (ఆస్ట్రేలియా)ను చిత్తు చేసింది. స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా) 7-6 (8-6), 7-6 (7-5)తో మార్టిచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌)పై, క్విటోవా 6-1, 6-4తో బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌ చేరారు. బార్టీ (ఆస్ట్రేలియా), కొలిన్స్‌ (అమెరికా), పవ్లించెన్‌కోవా  (చెక్‌ రిపబ్లిక్‌), అన్‌స్లమోవా (అమెరికా) కూడా ముందంజ వేశారు. రోజర్‌, రఫా జోరు: పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ రోజర్‌ ఫెదరర్‌, మాజీ ఛాంపియన్‌ రఫెల్‌ నాదల్‌ జోరు కొనసాగుతోంది. వీళ్లిద్దరూ పెద్ద కష్టపడకుండానే ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. మూడో సీడ్‌ ఫెదరర్‌ 6-2, 7-5, 6-2తో అమెరికా టీనేజర్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ను ఓడించాడు. రెండో సెట్లో తప్ప.. రోజర్‌కు ప్రత్యర్థి నుంచి పెద్ద ప్రతిఘటనే ఎదురు కాలేదు. ఈ మ్యాచ్‌లో 10 ఏస్‌లతో పాటు 34 విన్నర్లు కొట్టాడతను. ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో రోజర్‌కు ఇది 100వ మ్యాచ్‌ కావడం విశేషం. మరో మ్యాచ్‌లో నాదల్‌ 6-1, 6-2, 6-4తో డిమినర్‌ (ఆస్ట్రేలియా)ను ఓడించాడు. ఈ మ్యాచ్‌లో ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన నాదల్‌.. ఆరు ఏస్‌లతో పాటు 37 విన్నర్లు కొట్టాడు. ఆరోసీడ్‌ సిలిచ్‌ కూడా మూడో రౌండ్లో గెలిచాడు. వెర్దాస్కో (స్పెయిన్‌) నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న సిలిచ్‌ 4-6, 3-6, 6-1, 7-6 (10-8), 6-3తో కష్టంగా గట్టెక్కాడు. దిమిత్రోవ్‌ (బల్గేరియా), బటిస్టా అగట్‌ (స్పెయిన్‌), థామస్‌ బెర్డిచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌), టియాఫొ (అమెరికా) కూడా ప్రిక్వార్టర్స్‌ చేరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos