అదే చివరి క్షణం అనిపించింది..

అదే చివరి క్షణం అనిపించింది..

తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస పార్టీ మెడకు తరచూ ఏదోఒక వివాదం చుట్టుకుంటూనే ఉంది.ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలు,ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించడం,ప్రతిపక్ష విలీనం ఇలా ఏదో ఒక వివాదాన్ని నెత్తిన వేసుకుంటోంది.తాజాగా అటవీశాఖ మహిళ అధికారిపై తెరాస నేతలు దాడికి తెగబడడం తెరాసకు కొత్త తలనొప్పులు తెచ్చింది.మహిళా అధికారిపై విచక్షణారహితంగా దాడి చేసిన టీఆర్ఎస్ నేతల తీరుపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.సిర్పూర్ కాగజ్‌నగర్‌లో మహిళ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌పై జరిగిన దాడిని పలువురు ఖండిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగజ్‌నగర్‌లో తెరాస నేతలు కర్రలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ సదరు మహిళా అధికారిణి ఘటన గురించి వివరించారు.దాడికి పాల్పడ్డ సమయంలో అదే చివరి రోజని అనిపించిందని అసలు తనకు ఆ క్షణంలో బతుకుతాననే నమ్మకం లేకుండా పోయిందని వాపోయా.దాడికి దారి తీసిన పరిస్థితులను వివరించారు.కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిధిలోకి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ప్రాంతంలోని 20 హెక్టార్లలో మొక్కలు నాటాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మొక్కలు నాటడానికి అటవీశాఖ అధికారులు అక్కడికి వెళ్లారు.అయితే చెట్లు నాటేందుకు భూమి అనువుగా లేదని.. చదును చేయించేందుకు సిద్ధమయ్యారు అటవీ అధికారులు. అందులోభాగంగా భూమిని చదును చేసేందుకు ట్రాక్టర్లు, సిబ్బందితో సహా ఆదివారం ఉదయం ఆ ప్రాంతానికి చేరుకున్నారు.ఈ విషయం తెలసుకున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడు జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్‌ కోనేరు కృష్ణ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో అధికారులతో చోటు చేసుకున్న వాగ్వాదం శృతి మించడంతో విచక్షణ కోల్పోయిన కోనేరు కృష్ణ అటవీశాఖ మహిళ అధికారి అనితపై దాడికి తెగబడ్డాడు.ఆ వెంటనే మరో పది మంది కర్రలతో అధికారులపై దాడికి తెగబడడంతో అధికారులు ప్రాణభయంతో పరుగులు పెట్టాల్సి వచ్చింది.అందుకు సంబంధించిన వీడియో ప్రసార మాధ్యమాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్‌ కావడంతో సర్వత్ర విమర్శలు,ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.టీఆర్ఎస్ నేతల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టీఆర్ఎస్ నేతల జులుం అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు కృష్ణ జడ్పీ వైస్‌ చైర్మన్‌ పదవితో పాటు, జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు.ఇదిలా ఉండగా మహిళా అటవీ అధికారిపై జరిగిన దాడిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సిర్పూరు ఎమ్మెల్యే తమ్ముడి తీరుపై మండిపడ్డారు. 2008-2009లో అప్పటి కేంద్ర ప్రభుత్వం పోడుభూములపై గిరిజనులకు సర్వ అధికారాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడేమో టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల నుంచి పోడుభూములను బలవంతంగా లాక్కొనే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆ క్రమంలో పోడుభూముల్లో చెట్లను నాటాలని ప్రభుత్వం ఆదేశించడం సరికాదన్నారు. కాగజ్ నగర్ ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.మహిళా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌పై జరిగిన దాడిని వరంగల్‌ రేంజ్‌ ఐజీ నాగిరెడ్డి సైతం తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో విఫలమయ్యారనే కారణంతో కాగజ్‌ నగర్‌​ డీఎస్పీ సాంబయ్య, సీఐ వెంకటేశ్వర్లను సస్పెండ్‌ చేశారు.దీంతోపాటు మహిళ అధికారిపై దాడి చేసిన తెరాస నేతలు,కార్యకర్తలపై కఠిన చర్యలు తప్పవన్నారు జిల్లా ఎస్పీ మల్లారెడ్డి. మొత్తం 30 మందిని బాధ్యులను చేస్తూ అదుపులోకి తీసుకున్నామని, అందులో 16మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.కాగా ఘటనపై జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు వాదన మరోలా ఉంది. రైతులను నెల రోజులుగా అటవీ అధికారులు ఇబ్బందులకు గురిచేయడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. ఫారెస్ట్ అధికారులకు, రైతులకు మధ్య గొడవ జరిగిందని.. ఆ క్రమంలో రైతులు ఫోన్ చేస్తే తాము అక్కడకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. అంతేగానీ అధికారులపై తాము ఎలాంటి దాడులు చేయలేదని చెప్పే ప్రయత్నం చేశారు..

మహిళ అధికారి అనితపై దాడి చేస్తున్న తెరాస నేతలు..

మహిళ అధికారి అనితపై దాడి చేస్తున్న తెరాస నేతలు..

మహిళ అధికారి అనితపై దాడి చేస్తున్న తెరాస నేతలు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos