ముఖ్యమంత్రిని విమర్శించినందుకు కేసు

ముఖ్యమంత్రిని విమర్శించినందుకు  కేసు

గువహటి: అసోం ముఖ్యమంత్రి సర్బానంద్‌ సోనోవాల్‌కు వ్యతిరేకంగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారనే ఆరోపణపై నీతూ బోరా అనే వ్యక్తికి వ్యతిరేకంగా ప్రాథమిక సమాచార నివేదిక దాఖలు చేసినట్లు శుక్రవారం ఇక్కడ పోలీసులు వెల్లడించారు. ఇదే విషయంపై మరో ముగ్గుర్ని కూడా విచారించామన్నారు. ఫేస్ బుక్‌లో ఇటీవల పోస్ట్‌ చేసిన ఓ వీడియోలో స్థానికుల హక్కులను కాపాడడంలో, విదేశాల నుంచి వస్తున్న ముస్లింల నుంచి అసోం ప్రజలను రక్షించటంలో ముఖ్యమంత్రి సర్బానంద్‌ సోనోవాల్‌ విఫలమైనందుకు పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అసోంలో శాంతి భద్రతలు ఆందోళనకర స్థాయిలో ఉండటానికి ముఖ్యమంత్రియే కారణమని తప్పుబట్టారు. సోనోవాల్ కు బదులుగా హేమంత విశ్వ శర్మ బాధ్యతలు స్వీకరించాలని ఆశించారు. దీనిపై భాజపా ఐటీ సెల్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. సొంత పార్టీలోనే భావప్రకటనా స్వేచ్ఛ లేదని ఆక్రోశించారు.‘ పౌరులకు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసే హక్కు ఉంది. దాన్ని హరించే అధికారం ఎవరికీ లేద’న్నారు. ‘నీతూ బోరా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కేవలం తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశార’న్నారు. ఉత్తర్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టు చేసిన వ్యవహారంలో ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు ప్రశాంత్‌ కనోజియాను పోలీసులు అరెస్టు చేయటాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పు బట్టి ప్రశాంత్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించటం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos