హొసూరులో నాటు సారా ప్రవాహం

హొసూరులో నాటు సారా ప్రవాహం

లాక్ డౌన్ కారణంగా హోసూరు ప్రాంతంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు మూత పడడంతో మద్యం ప్రియుల చూపు నాటుసారాపై మళ్లింది. ఈ పరిణామం…పాత కథ మళ్ళీ ఎక్కడ పునరావృతం కాబోతుందో అని పోలీసుల కంటి మీద కునుకులేకుండా చేస్తున్నది. తమిళనాడులో  ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభం కాక మునుపు రాష్ట్ర వ్యాప్తంగా నాటు సారా వ్యాపారం జోరుగా సాగేది. 15 ఏళ్ల క్రితం కల్తీ సారా తాగి రాష్ట్ర వ్యాప్తంగా వందలమంది ప్రాణాలుకోల్పోగా హోసూరు ప్రాంతంలో 20 మందికి పైగా మృతి చెందారు. దానితో రాష్ట్రంలో నాటుసారాను అరికట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ప్రభుత్వం మద్యం దుకాణాలను (టాస్మాక్)ప్రారంభించింది. ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభం కావడంతో  ఖాజానాకు ఆదాయం సమకూరడమే కాక ప్రాణ నష్టం తగ్గింది. ఇదిలా ఉండగా  కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఇదే అదునుగా భావించిన నాటు సారా విక్రేతలు రెచ్చిపోయి తయారీ అధికం చేశారు. పోలీసులకు ఇది తలనొప్పిగా మారింది. ఒక పక్క 144 సెక్షన్ అమలులో బిజీగా వున్న పోలీసులు నాటు సారా విక్రేతలను కట్టడి చేసే పనిలో పడ్డారు. డెంకణీకోట, అంచెట్టి, కెలమంగలం, సూలగిరి తదితర ప్రాంతాలలో నాటుసారా వ్యాపారం జోరుగా సాగడంతో సారా విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించి 20 మందికి పైగా పోలీసులు అరెస్టు చేయడమే కాక వేల లీటర్ల నాటుసారా ఊటలను ధ్వంసం చేశారు. పోలీసులు దాడులు ముమ్మరం చేసినా నాటు సారా ప్రవాహాన్ని కట్టడి చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. నాటు సారా వల్ల హోసూరు ప్రాంతంలో పాత కథ ఎక్కడ పునరావృతం అవుతుందోనని పోలీసులు ఆందోళన చెందుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos