వైసీపీ ఫ్లెక్సీలో దగ్గుబాటి: జగన్ ఒకే చెప్తే.. ముహూర్తం ఖరారు?

వైసీపీ ఫ్లెక్సీలో దగ్గుబాటి: జగన్ ఒకే చెప్తే.. ముహూర్తం ఖరారు?

మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ మహిళా (బీజేపీ) నేత దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుందనే ప్రచారం గత కొన్నాళ్లుగా సాగుతోంది. ఆ ప్రచారానికి బలం చేకూర్చే అంశాలు వెలుగు చూస్తున్నాయి. పురంధేశ్వరి పార్టీ మారినా, మారకపోయినా ఆమె తనయుడు దగ్గుబాటి హితేష్ మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి గుంటూరు పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు స్థానాల్లో ఏదో ఒకటి ఇవ్వాలని వైసీపీ అధినేత వైయస్ జగన్‌ను అడుగుతున్నారని తెలుస్తోంది. దీనిపై చర్చలు జరుగుతున్నయట.
వైయస్ ఫోటో ఓవైపు, దగ్గుబాటి మరోవైపు..
దగ్గుబాటి హితేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారానికి తాజా ఉదంతం ఒకటి బలం చేకూర్చేలా చేస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల్లో, పట్టణాల్లో రాజకీయ నాయకుల శుభాకాంక్షలతో ఫ్లెక్సీలు వెలుస్తుంటాయి. ఇందులో భాగంగా గొల్లపాలెం గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోను శుభాకాంక్షలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇందులో స్థానిక వైసీపీ నేతలతో పాటు దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఫోటో ఓ వైపు, వైయస్ రాజశేఖరరెడ్డి ఫోటో మరోవైపు ఉంది. ఈ ఫ్లెక్సీలో హితేష్ ఫోటో కూడా ఉంది.
పురంధేశ్వరి మాత్రం బీజేపీలోనేనా?
తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, కొడుకు హితేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పడికీ పురంధేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఆమెతోను చర్చలు జరుగుతున్నాయని, గుంటూరు లేదా నరసారావుపేట టిక్కెట్ అడుగుతున్నారని, అన్నీ ఒకే అయితే ఈ నెల 21వ తేదీన వైసీపీలో చేరే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది. కానీ పురంధేశ్వరి మాత్రం బీజేపీలోనే ఉంటారని, హితేష్, వెంకటేశ్వర రావులు మాత్రమే వైసీపీలో చేరుతారనే మరో ప్రచారమూ ఉంది. వైసీపీలో చేరడంపై దగ్గుబాటిని మీడియా ప్రశ్నించినప్పుడు సమయం వచ్చినప్పుడు చెబుతామని కూడా అన్నారట. ఆ వ్యాఖ్యలను బట్టి చర్చలు జరుగుతున్నాయని అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు. పార్టీ అధినేత వైయస్ జగన్, దగ్గుబాటి కుటుంబాల మధ్య సంధానకర్తగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇరువురితో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos