ఏఎన్-32 ప్రయాణికుల మృతదేహాలు లభ్యం

ఏఎన్-32 ప్రయాణికుల మృతదేహాలు లభ్యం

న్యూఢిల్లీ: ఇటీవల కూలిపోయిన వాయుసేనకు చెందిన ఏఎన్ -32 విమాన ప్రయాణికుల్లో ఆరుగురి మృతదేహాలను గుర్తించినట్లు గురువారం ఇక్కడ వాయుసేన అధికారులు తెలిపారు. మిగతా ఏడుగురి శరీర భాగాలు కూడా లభ్యమయ్యాయన్నారు. సముద్ర మట్టానికి దాదాపు 12 వేల అడుగుల ఎత్తులో వీరి శరీర భాగాలు చల్లాచెదరుగా పడివున్నాయనివివరించారు. రష్యాలో తయారైన ఈ టర్బోప్రాప్ రవాణా విమానం, అసోంలోని జోర్హాట్ నుంచి మేచుకాకు బయలుదేరి కూలిపోవటం తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులకు విమాన ప్రయాణికులు అందరూ మరణించారని అధికారిక ప్రకటన వెలువడింది. జోర్హాట్ లోని ఎయిర్ బేస్ కు మృతదేహాలు, శరీర భాగాలను చేర్చామని, వాటిని బంధువులకు అప్పగించనున్నామని అధికారులు తెలిపారు. విమానంలోని సీవీఆర్ (కాక్ పీట్ వాయిస్ రికార్డర్), బ్లాక్ బాక్స్ లను గతవారంలోనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాల్లో విమానం కూలిన కారణంగానే, విమానాన్ని గుర్తించడంలోనూ, మృతదేహాలను వెలికి తేవడంలోనూ ఆలస్యం జరిగిందని అధికారులు విపులీకరించారు.

తాజా సమాచారం