ఆపద్బాంధవులపై అలసత్వం

ఆపద్బాంధవులపై అలసత్వం

హొసూరు :  ఆరోగ్యం బాగా లేనప్పుడు ఒక్క ఫోన్ కాల్ తో మన ముందర వాలే 108 వాహన సిబ్బంది మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ప్రమాదాల్లో గాని, ఆరోగ్య పరంగా కానీ ఎవరికి ఏ కష్టమొచ్చినా ఫోన్ చేసిన మరుక్షణం వాహనంతో పరుగు తీసి ప్రాణాలను సైతం లెక్క చేయక బాధితులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చి ప్రాణాలను కాపాడుతు మానవత్వాన్ని చాటుకొంటున్న వారే 108 వాహన ఉద్యోగులు. బాధితులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చకపోతే కొన్ని వేల మంది చనిపోయేవారు. అందరి కుటుంబాలలో వెలుగులు నింపుతూ తమ కుటుంబాలను మరచి రాత్రనక పగలనక ఆపద సమయంలో ప్రాణాలను కాపాడుతున్న ఈ ప్రాణదాతలు దేవుళ్ళతో సమానమే. కానీ వీరిని పట్టించుకొనే నాథులే కరువయ్యారు. కరోనా రక్కసి పంజా విప్పడంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు.అందులో భాగంగా పట్టణం నుండి పల్లెల వరకు లాక్డౌన్ కొనసాగుతున్నది. పరిశ్రమలు, వాణిజ్యసముదాయాలు అన్ని మూతపడ్డాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమైయ్యారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగకూడదని ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టాయి.ప్రజలకు నిత్యవసరవస్తువులకు ఇబ్బంది కలుగక వివిధ రాజకీయ పార్టీలకు చెందినవారు, స్వచ్చంద సంస్థలకు చెందినవారు పేదలకు పంచి తమ ఉదారతను చాటుకొంటున్నారు. అంతా బాగా వున్నా లాక్ డౌన్ కొనసాగుతు ప్రజలు ఇళ్లకే పరిమితమైన ఈ సమయంలో కూడా ఎవరికి కష్టమొచ్చినా వారి ఇంటిముందు వాలిపోయి బాధితులను 108 వాహన ఉద్యోగులు కాపాడుతున్నారు.హోసూరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో ఈ ప్రాంతంలోని బాగలూరు, సూలగిరి, డెంకణీకోట, అంచెట్టి, తదితర ప్రాంతాలతో కలిపి 108 వాహనాలు 16 ఉండగా వీటిలో 50 మందికి పైగా విధులు నిర్వహిస్తున్నారు. చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న ఈ ప్రాణదాతల బాధలు వర్ణానాతీతం. లాక్ డౌన్ కారణంగా రాజకీయ నాయకులు,దాతలు ప్రజలకే కాక పారిశుద్ధ్య కార్మికులు,పోలీసు కుటుంబాలకు నిత్యవసర వస్తువులు ఇచ్చి ఆదుకొంటున్నా ప్రాణదాతలను మరచి పోవడం బాధాకరం. టన్నుల కొద్ది కూరగాయలను,నిత్యవసర వస్తువులను ప్రజలకు పంపిణీ చేస్తున్న రాజకీయనాయకులు 108 వాహన ఉద్యోగులు, కాదు…కాదు ప్రాణదాతలను మరిచిపోవడం వారి దౌర్భాగ్యం.హోసూరు ప్రాంతంలో 108 వాహనాలే కాక ప్రైవేట్ అంబులెన్సుల వారు కూడా ఎందరో ప్రాణాలను కాపాడుతున్నారు.అందరిని ఆదుకొంటున్నా నాయకులు తమ వైపు కన్నెత్తి కూడా చూడలేదని 108 వాహన  ఉద్యోగులు, ప్రైవేట్ అంబులెన్సులకు చెందిన వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా మూడు రోజులైనా ఇంటికి వెళ్లక విధులు నిర్వహిస్తున్నామని, తమకు కుటుంబాలు వున్నా ప్రజల ప్రాణాలే ముఖ్యంగా తలచి పనిచేస్తున్న మమ్ములను మరిచిపోవడం బాధాకరమని కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు   టన్నుల కొద్దీ నిత్యవసర వస్తువులు పంపిణీ చేసి ఆదుకొన్నా, కులాలకు, మతాలకు అతీతంగా పని చేస్తూ ఆపద కాలంలో బాధితులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చి ప్రాణదాతలుగా నిలుస్తున్న 108 వాహన ఉద్యోగులు,ప్రైవేట్ అంబులెన్సులకు చెందిన వారిని ఆదుకుని తమ ఉదారతను చాటుకొనే బాధ్యత నాయకులు, దాతలపై ఎంతైనా ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos