న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ స్వాగతించారు. ఈ పథకాన్ని ఓ కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. అమెరికాలోని మాసాచూసెట్స్లో ఉన్న అమర్త్యసేన్ పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సుప్రీం తీర్పు పారదర్శకతను పెంచిందని వ్యాఖ్యానించారు. ‘ఎన్నికల బాండ్ల పథకం ఓ కుంభకోణం. దానిని ఇప్పుడు ఉపసంహరించడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు ఎంతో పారదర్శకత చేకూరుతుందన్న విశ్వాసం నాకు కలిగింది. ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయి’ అని అమర్త్యసేన్ తెలిపారు. పార్టీ రాజకీయాల కారణంగా భారతీయ ఎన్నికల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులు ఎన్నికల రంగంలోకి దిగే పరిస్థితే లేకుండా పోయిందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల విషయంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనే విషయం పైన దేశ ఎన్నికల వ్యవస్థ ప్రభావితమవుతోందని అన్నారు. ‘ప్రతిపక్షాలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వంలోని వారు ప్రయత్నిస్తారు. ఇది ఎన్నికల వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. సాధ్యమైనంత వరకూ స్వేచ్ఛాయుత ఎన్నికల వ్యవస్థను మనం కోరుకుంటున్నాము. భావ ప్రకటనా స్వేచ్ఛ కూడా అవసరమే’ అని వివరించారు. పౌరులందరికీ రాజకీయ స్వేచ్ఛ కల్పించాలని రాజ్యాంగం కోరుకున్నదని, అది ఏ ఒక్క సమాజానికీ ప్రత్యేక అధికారాలు కల్పించలేదని అమర్త్యసేన్ అన్నారు.