ఆలోక్‌పై హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు..

ఆలోక్‌పై హడావుడిగా నిర్ణయం తీసుకున్నారు..

దిల్లీ: సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లేవని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే పట్నాయక్‌ వెల్లడించారు. ఆలోక్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేంద్ర నిఘా సంస్థ(సీవీసీ) చేపట్టిన విచారణను పర్యవేక్షించిన పట్నాయక్‌ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సుప్రీంకోర్టు సూచన మేరకు పట్నాయక్‌ ఆ దర్యాప్తును పర్యవేక్షించారు. ఆలోక్‌ అవినీతికి పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ ‘చాలా హడావుడిగా’ నిర్ణయం తీసుకుందని పట్నాయక్‌ అన్నారు.
సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్ అస్థానా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఆలోక్‌పై దర్యాప్తు జరిగిందని పట్నాయక్‌ వెల్లడించారు. అయితే సీవీసీ నివేదికలోని నిర్ధారణలు తనవి కావని తెలిపారు. సీవీసీ తనకు అందజేసిన నివేదికపై అస్థానా సంతకం ఉందని, అయితే అది తన సమక్షంలో పెట్టలేదని పేర్కొన్నారు. తాను కేవలం దర్యాప్తును పర్యవేక్షించానని, సహజ న్యాయ సూత్రాలకు సంబంధించిన విషయాలను, ఇతర విధానపరమైన నిబంధనలను పరిశీలించానని వివరించారు. సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన ఆలోక్‌పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఆయనను అగ్నిమాపక శాఖ డీజీగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మనస్తాపానికి గురైన ఆలోక్‌ కొత్త బాధ్యతలు చేపట్టకుండానే పదవీ విరమణ చేశారు. కమిటీ తీరును తీవ్రంగా తప్పుపట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos