ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఐక్యత చాటుకుంటున్న ఎస్పీ-బీఎస్పీ

ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఐక్యత చాటుకుంటున్న ఎస్పీ-బీఎస్పీ

ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్ హయాంలో జరిగిన మైనింగ్‌ వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అఖిలేశ్‌పైనా ఈ దాడులు జరగడం ఖాయమని వార్తలొస్తున్నాయి. తనకేమీ భయం, ఆందోళన వంటివేమీ లేవని.. సీబీఐ దాడులు ఎందుకు జరుగుతున్నాయో అందరికీ తెలుసని అఖిలేశ్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన అన్న మాటలతో ఇప్పుడు బీఎస్పీ-ఎస్పీ పొత్తుపై భారీ హోర్డింగులు లఖ్‌నవూలో దర్శనమిస్తున్నాయి. స్థానిక ఎస్పీ, బీఎస్పీ కార్యకర్తలు వీటిని ఏర్పాటు చేసి తమ ఐక్యత చాటుకుంటున్నారు.

అఖిలేశ్‌, మాయావతి ఉన్న ఫ్లెక్సీపై.. ‘‘భాజపా వద్ద సీబీఐ ఉంటే… మా దగ్గర కూటమి ఉంది’’, ‘‘సత్యం ఎప్పుడూ ఓడిపోదు’’ అని సీబీఐ దాడులను ఉద్దేశించి అఖిలేశ్‌ అన్న మాటలను ఫ్లెక్సీలపై ముద్రించారు.

అఖిలేశ్‌పై సీబీఐ దాడులు ఖాయమని వార్తలు వ్యాప్తి చెందిన అనంతరం సోమవారం మాయావతి తన పూర్తి మద్దతును ఎస్పీకి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి జిమ్మిక్కులకు తాము భయపడేది లేదని ఆ సందర్భంగా మాయావతి అఖిలేశ్‌తో అన్నారు. భాజపా, కాంగ్రెస్‌లపై విమర్శలు చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ తరహాలోనే భాజపా కూడా కేంద్ర సంస్థలను ఉపయోగించుకొని రాజకీయ శత్రువులను ఉచ్చులో పడేస్తోందని ఆరోపించారు. ఎస్పీ-బీఎస్పీ కూటమిపై ఊహాగానాలు బయటికొచ్చిన మరుక్షణం భాజపా సీబీఐను దాడులకు ఉసిగొల్పిందని మాయావతి విమర్శించారు.

తాజా సమాచారం