నేను అమ్మాయిని కాబట్టి పొగరు అంటారా

తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మంత్రి భూమా అఖిలప్రియ శుక్రవారం మండిపడ్డారు. అయితే చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆమె ఇప్పుడు బయటకు రావడం గమనార్హం. పార్టీ అధిష్టానం ఆమెను బుజ్జగించిందా అనే చర్చ సాగుతోంది. అయితే, పార్టీకి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆమె తేల్చి చెప్పారు. తనపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారని, పార్టీని వీడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. కార్యకర్తలను, ప్రజలను డైవర్ట్ చేసేందుకు కొంత మీడియా ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమా కుటుంబంలో విభేదాలు తీసుకురావాలని ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
జనసేన టాపిక్ ఎందుకు వస్తుంది ..
ఓ ఛానల్ అయితే తాను తన చెల్లెలిని తీసుకొని, జనసేన పార్టీలోకి వెళ్తున్నానని పేర్కొన్నారని అఖిలప్రియ అన్నారు. అసలు జనసేన టాపిక్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తనకు అర్థం కావడం లేదన్నారు. భూమా నాగిరెడ్డి చనిపోయినప్పటి నుంచి చంద్రబాబుకు తనకు అండగా ఉన్నారని చెప్పారు. అలాంటప్పుడు పార్టీ ఎందుకు మారుతానని ప్రశ్నించారు. తాను పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్న మీడియా.. ఎందుకో కూడా చెప్పాలన్నారు. ఎంతసేపు పార్టీ మారాలనుకుంటున్నారని చెప్పడం విడ్డూరమన్నారు. కథలుకథలుగా రాస్తున్నారు. చంద్రబాబు తనకు పదవి ఇచ్చి, మర్యాద ఇచ్చారన్నారు.
నేను పార్టీని విమర్శించలేదు..
తన తండ్రి భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నానని, అందుకు చంద్రబాబు సహకరిస్తున్నారని, దానికి పార్టీ మారాలా అని అఖిలప్రియ ప్రశ్నించారు. ఆళ్లగడ్డను అభివృద్ధి చేస్తున్నందుకు, తన తండ్రి చనిపోయాక కుటుంబానికి అండగా ఉన్నందుకు పార్టీ మారాలా అని ప్రశ్నించారు. ఇన్ని అభివృద్ధి పనులు చేస్తుంటే పార్టీ మారే టాపిక్ ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. నేను ఎక్కడా కూడా పార్టీని విమర్శించలేదన్నారు.
ఆళ్లగడ్డలో పార్టీకి నేను అడ్వాంటేజ్..
ఎంతసేపు భూమా అఖిలప్రియ అలిగిందని, అందరితో కొట్లాడుతోంది కాబట్టి పార్టీ పక్కన పెడుతోందని చెబుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. పార్టీ తనను పక్కన పెట్టడం లేదని, అలాంటప్పుడు ఆ టాపిక్ ఎందుకు వస్తోందన్నారు. నేను ఏం చేశానని పార్టీ తనను దూరం పెడుతుందని అడిగారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందని, ప్రజల్లోకి వెళ్తున్నానని లేదంటే నా గ్రూప్ తనను నమ్ముతుందని పార్టీ తనను దూరం పెడుతుందా అన్నారు. ఆళ్లగడ్డలో పార్టీకి నేను అడ్వంటేజ్ అన్నారు.
నా వాళ్ల కోసం కొట్లాడుతున్నా..
తాను కొట్లాడుతున్నానని తప్పుగా చూపించడం సరికాదని అఖిలప్రియ అన్నారు. రాజకీయాల్లో ఉన్నవారు అసలు ఎవరు కొట్లాడటం లేదని ప్రశ్నించారు. జగన్ టీడీపీతో కొట్లాడడం లేదా, టీడీపీ వాళ్లు బీజేపీతో కొట్లాడటం లేదా, బీజేపీ వాళ్లు కాంగ్రెస్‌తో కొట్లాడటం లేదా అని ప్రశ్నించారు. అలాగే, నా ఆళ్లగడ్డ ప్రజల కోసం, నా కార్యకర్తల కోసం నేను కొట్లాడుతున్నానని చెప్పారు. అది తప్పు ఎలా అవుతుందన్నారు.
అబ్బాయి అయితే అలా, నాకైతే పొగరా..
అదే ఓ అబ్బాయి అయితే (కొట్లాడితే) అద్భుతంగా కొట్లాడుతున్నారని చెబుతారని, నేను అమ్మాయిని కాబట్టి ఈమెకు పొగరు అన్నట్లుగా మాట్లాడుతారా అని అఖిలప్రియ ప్రశ్నించారు. తనపై ఒక ఛానల్ మాత్రమే తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. దయచేసి ఓ సందేశం ఇస్తున్నానని, పార్టీకి తనకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదని చెప్పారు. తన కార్యకర్తలను, ప్రజలను డిస్టర్బెన్స్ చేయాలని చూస్తున్నా తన పని తాను చేసుకుంటున్నానని చెప్పారు. ఈరోజు అదే ఛానల్ వాళ్లు నేను జన్మభూమికి వస్తున్నట్లు చెబుతున్నారన్నారు. నేను అలిగి కూర్చుంటే వారం రోజులుగా జన్మభూమిలో ఎలా పాలుపంచుకుంటున్నానని ప్రశ్నించారు.
తప్పుడు రిపోర్ట్స్ పై ఫైట్..
తాను పార్టీ మారుతానంటూ వివిధ రకాల ప్రచారం ఎందుకు తీసుకు వస్తున్నారని అఖిలప్రియ మండిపడ్డారు. చంద్రబాబుకు తనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీ కోసం ఏదో చేయ్యాలని భావిస్తున్నామని చెప్పారు. పార్టీకి తప్పుడు రిపోర్ట్స్ వెళ్తున్నందున వాటిని నిరూపించాలని పోరాటం చేస్తున్నానని, కానీ పార్టీ పైన కాదని చెప్పారు. ఆ క్లారిటీ ఇచ్చేందుకే నేను మీడియా ముందుకు వచ్చానని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos