తక్కువ గ్రేడ్‌ బొగ్గు సరఫరాతో మోసం

తక్కువ గ్రేడ్‌  బొగ్గు  సరఫరాతో మోసం

న్యూఢిల్లీ : ప్రధానీ మోడీకి ఆప్తమిత్రుడిగా గుర్తింపు పొందిన కుబేరుడు గౌతం అదానీ బొగ్గు కుంభకోణానికి పాల్పడుతున్నారు. తక్కువ గ్రేడ్ బొగ్గును అధిక విలువగా చూపిస్తూ విక్రయిస్తున్నారని ఫైనాన్సీయల్ టైమ్స్ ఓ రిపోర్ట్లో వెల్లడించింది. నాసిరకం బొగ్గుతో ప్రభుత్వ రంగ విద్యుత్ కంపెనీలను మోసం చేస్తున్నారని తెలిపింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరెప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ) నుంచి పొందిన డాక్యుమెంట్ల పరిశీలన ఆధారంగా చేసుకుని ఫైనాన్సీయల్ టైమ్స్ (ఎఫ్టీ) ఈ కథనం ప్రచురించింది. నాసిరకం బొగ్గును సరఫరా చేయడం ద్వారా అదానీ భారీ లాభాలను ఆర్జిస్తున్నారు. తక్కువ గ్రేడ్ బొగ్గును విద్యుత్ కోసం ఉపయోగించడం అంటే ఎక్కువ ఇంధనాన్ని కాల్చడం ద్వారా గాలి నాణ్యతను ఫణంగా పెడుతున్నారు. మరోవైపు అదానీ మోస పూరితంగా బంపర్ లాభాలను పొందుతున్నారు. జనవరి 2014లో అదానీ ఒక కిలోగ్రాముకు 3,500 కేలరీలు కలిగి ఉన్న ఇండోనేషియా బొగ్గును కొనుగోలు చేసినట్లు ఇన్వాయిస్లు చూపిస్తున్నాయి. అదే షిప్మెంట్ను తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (టాంగెడ్కో)కి 6,000 కేలరీల బొగ్గుగా విక్రయించారు. ఇది అత్యంత విలువైన గ్రేడ్లలో ఒకటి. రవాణా ఖర్చుల తర్వాత అదానీ తన ధరను ఈ ప్రక్రియలో రెండింతలు పెంచినట్లు స్పష్టమవుతోంది. దీన్ని రుజువు చేయడానికి 2014లోని 22 షిప్మెంట్ల డాక్యుమెంటేషన్లను సరిపోల్చినట్లు ఫైనాన్సీయల్ టైమ్స్ తెలిపింది. ఇండోనేషియాలోని తక్కువ కాలరీల ఉత్పత్తికి పేరుగాంచిన మైనింగ్ గ్రూప్ నుంచి అదానీ బొగ్గును కొనుగోలు చేశారు. దీన్ని దక్షిణాదిలోని ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలకు ఖరీదైన బొగ్గుగా సరఫరా చేసింది. దీంతో విద్యుత్ సంస్థలు నష్టపోవడమే కాక.. ఈ బొగ్గుతో వెలుపడిన కాలుష్యంతో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ”విద్యుత్ రంగ ప్రయోజనాలకు అనుకూలంగా ప్రజారోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు.” అని న్యూఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్లోని విశ్లేషకుడు సునీల్ దహియా అన్నారు. 2021-2023 మధ్యకాలంలో మార్కెట్ ధరలకు మించి భారత్కు దిగుమతి చేసుకున్న బొగ్గు కోసం మధ్యవర్తులకు ఐదు బిలియన్ డాలర్ల (రూ.45వేల కోట్లు)కు పైగా చెల్లించినట్లు నివేదికలు రావడంతో ప్రతిపక్ష పార్టీలు అదానీపై విచారణకు డిమాండ్ చేసిన విషయాన్ని ఫైనాన్సీయల్ టైమ్స్ గుర్తు చేసింది. ఆర్థిక నేరాల పరిశోధనాత్మక విభాగమైన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) 2016లో బొగ్గు ధరలపై విచారణ ప్రారంభించింది. బొగ్గు ధరలను 68 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.566 కోట్లు) పెంచి చూపించిన ఆరోపణకు సంబంధించి అదానీపై విచారణ జరిపింది.అదానీ 2013లో ఇండోనేషియాలో 28 డాలర్లకు ఒక్క టన్ను కొనుగోలు చేయగా.. దీన్ని భారత్లో 92 డాలర్లకు విక్రయించిందని ఎఫ్టీ రిపోర్ట్ చేసింది. అదే బొగ్గులో కిలోకు 3,500 కేలరీలు ఉండగా..దాని నాణ్యతను 6,000 కేలరీలకు పెంచి చూపింది. తక్కువ గ్రేడ్ రకం బొగ్గును అధిక నాణ్యత కలిగిన బొగ్గుగా చూపించడంతో పాటుగా ధరను అమాంతం పెంచి ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు అంటగట్టడం ద్వారా అదానీ కంపెనీ భారీగా లబ్ది పొందిందని ఎఫ్టీ విశ్లేషించింది. ఆ బొగ్గు వాడకంతో కాలుష్యం బాగా పెరిగింది. మరోవైపు విద్యుత్ కంపెనీల ఆదాయాలు కరిగిపోయాయి. ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో ఆ భారం ఆటోమెటిక్గా ప్రజలపై పడిందని స్పష్టమవుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos